Singareni Elections: సింగరేణిలో టీబీజీకేఎస్ కథ ముగిసిందా..? దారుణ పరాజయం తేల్చిందేంటి..?

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు టీబీజీకేఎస్‌ బాణానికి తిరుగే లేదన్నట్టు సాగింది వ్యవహారం. తాజా ఎన్నికల్లో మొత్తం 37వేల 451 ఓట్లు పోలవగా.. నిన్నటి దాకా అధికారం చెలాయించిన టీబీజీకేఎస్‌కు కేవలం 1298 ఓట్లే వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 03:26 PMLast Updated on: Dec 30, 2023 | 3:26 PM

Tbgks Defeated In Singareni Elections Here Is The Reason

Singareni Elections: ఓడలు బళ్లు అవుతాయన్న సామెత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ అవుతుందంటున్నారు. ఎందుకంటే.. 11 ఏళ్ల పాటు కోల్‌బెల్ట్‌లో ఏకఛత్రాధిపత్యం నడిపిన ఆ కార్మిక సంఘం ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికల గుర్తు బాణం గురితప్పింది. ఎక్కుపెట్టిన బాణం గుర్తుతో వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన టీబీజీకేఎస్ (TBGKS) తాజాగా జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. దీంతో బాణం గుర్తు గనిలో గాయబ్‌ అన్న సెటైర్లు పడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆవిర్భవించి, రాష్ట్ర సాధనలో కీలకంగా ఉన్న టీబీజీకేఎస్.. బీఆర్ఎస్‌కు అనుబంధంగా కొనసాగింది.

TDP Vs YSRCP: రివర్స్‌ గేమ్‌ మొదలుపెట్టిన టీడీపీ.. జగన్‌కు చుక్కలు కనిపించడం ఖాయమా..?

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు టీబీజీకేఎస్‌ బాణానికి తిరుగే లేదన్నట్టు సాగింది వ్యవహారం. తాజా ఎన్నికల్లో మొత్తం 37వేల 451 ఓట్లు పోలవగా.. నిన్నటి దాకా అధికారం చెలాయించిన టీబీజీకేఎస్‌కు కేవలం 1298 ఓట్లే వచ్చాయి. ఒక్క మణుగూరులో 728 ఓట్లతో మూడో స్థానంలో నిలవడం మినహా ఎక్కడా చెప్పుకోదగ్గ ఓట్లు పడలేదు. గత ఎన్నికల్లో గెలిచిన ఇల్లందు ఏరియాలో కేవలం ఒక్కటంటే ఒకే ఓటు, బెల్లంపల్లిలో మూడు ఓట్లు మాత్రమే బాణం గుర్తుకు పడ్డాయి. ఈసారి రెండు వేల ఓట్ల తేడాతో ఏఐటీయూసీ (AITUC) విజయం సాధించగా.. ఆరు స్థానాల్లో గెలిచి తన బలాన్ని పెంచుకున్న ఐఎన్‌టీయూసీ (INTUC) సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. కనీస ఓట్లను సాధించలేక కారు పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ చతికిలపడింది. సింగరేణి కార్మికులకు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని మెడికల్ బోర్డు, డిపెండెంట్‌ ఉద్యోగాలు, లాభాల్లో వాటా పెంపు లాంటి సమస్యలను తామే పరిష్కరించామని ప్రచారం చేసుకున్నారు బీఆర్‌ఎస్ నేతలు (BRS). అయినా అసెంబ్లీ ఎన్నికల్లోలాగే సింగరేణి ఓటర్లు కూడా బీఆర్ఎస్‌ను తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం కోల్‌బెల్ట్‌లోని మొత్తం 11 సీట్లకు గాను ఒక్కచోటే బీఆర్‌ఎస్‌ గెలిచింది.

ఈ తీర్పుతో ఖంగుతిన్నారట గులాబీ నేతలు. వెంటనే వచ్చిన సింగరేణి ఎన్నికల్లో అదే తీర్పు రిపీట్ అవ్వడంతో మీమాంసలో పడ్డారట. అదే జరిగితే పార్లమెంట్ ఎలక్షన్‌‌పై ప్రభావం పడుతుందని భావించి పోటీకి దూరంగా ఉండాలని ముందు అనుకుంది నాయకత్వం. ఆ స్టేట్‌మెంట్‌ తర్వాత నేతలు వలసబాట పట్టడంతో అస్త్ర సన్యాసం మొదటికే మోసం తెస్తుందని గ్రహించి.. ఆత్మ సాక్షిగా ఓటేయండంటూ గౌరవాధ్యక్షురాలు కవిత పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. అస్త్ర సన్యాస నిర్ణయం.. ఆత్మసాక్షిగా ఓటేయండనే ప్రకటనతో క్యాడర్‌లో అయోమయం పెరిగి అంతా తల్లకిందులైందన్నది ఓ విశ్లేషణ. సింగరేణిలో 18 వేల డిపెండెంట్ ఉద్యోగాలిప్పించామని చెప్పుకున్న బీఆర్ఎస్‌కు అదే బూమరాంగ్‌ అయిందన్న చర్చ జరుగుతోందట కోల్‌బెల్ట్‌లో. ఆ నియామకాల్లో జరిగిన అవినీతే.. టీబీజీకేఎస్ కొంప ముంచిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదీగాక 20వేలకు పైగా ఉన్న యువ ఓటర్లు బాణం గుర్తు వైపు చూడలేదట. అలాగే మైన్‌ టు మైన్‌ ట్రాన్స్‌ఫర్స్‌, షిఫ్ట్‌ ఛేంజ్‌ లాంటి చిన్న చిన్న పనులకు సైతం లంచాలు ఇచ్చుకోవాల్సి రావడం కార్మికుల్లో మార్పునకు కారణమైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Grandhi Srinivas: పవన్ కల్యాణే కావాలి.. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్..!

పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు కానీ ఒక్కరు కూడా సింగరేణి ఎన్నికల వైపు చూడకపోవడం టీబీజీకేఎస్‌ నాయకుల్లో నైరాశ్యాన్ని పెంచిందట. మొత్తంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడిన కీలక సంఘాల్లో ఒకటైన టీబీజీకేఎస్ – బీఆర్ఎస్ పెద్దల నిర్ణయాల వల్లే.. కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నది కోల్‌బెల్ట్‌ టాక్‌. వాళ్ళ విధానాల వల్లే అంపశయ్య మీదికి చేరిందని, దాన్ని తిరిగి బతికిస్తారో.. లేక మంచి ముహూర్తం చూసి అట్నుంచి అటే పంపేస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు.