AP Guntur West Seat: గుంటూరు వెస్ట్ సీటు కోసం 14 మంది పోటీ.. ఆ సీటుకు ఎందుకంత డిమాండ్..?
టీడీపీ, జనసేన కూటమి నుంచే. కలిసి పోటీ చేద్దామనుకున్న పార్టీలు కూడా సీటు మాకంటే మాకంటూ డిమాండ్ చేస్తున్నాయి. గుంటూరు వెస్ట్ ఎందుకంత స్పెషల్ ? అంతా ఆ సీటునే ఎందుకు కోరుకుంటున్నారు?
AP Guntur West Seat: గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. అది కూడా కేవలం టీడీపీ, జనసేన కూటమి నుంచే. కలిసి పోటీ చేద్దామనుకున్న పార్టీలు కూడా సీటు మాకంటే మాకంటూ డిమాండ్ చేస్తున్నాయి. గుంటూరు వెస్ట్ ఎందుకంత స్పెషల్ ? అంతా ఆ సీటునే ఎందుకు కోరుకుంటున్నారు?
JANASENA: పొత్తులో జనసేనకు దక్కబోయే స్థానాలు ఇవేనా..?
గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గం గుంటూరు పశ్చిమ. హార్ట్ ఆఫ్ ది సిటీ లో ఉండే నియోజకవర్గం ఇది. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. దీంతో ఇప్పుడు ఇక్కడ ఆశావాహులు సందడి చేస్తున్నారు. ఒకరు.. ఇద్దరు కాదు.. దాదాపు 14మంది టీడీపీ-జనసేన కూటమి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారట. ఆశావహులు అంటే ఎవరో దారిన పోయే దానయ్యలు కాదు. మాజీ మంత్రి స్థాయి నుంచి మాజీ ఐఏఎస్‌ల వరకు ఈ లిస్టులో ఉన్నారు. మరోవైపు గుంటూరు సిటీలో ప్రముఖ డాక్టర్లు, ఎన్నారైలు కూడా ఈ సీటుపై కన్నేశారట. ఇక సామాజిక వర్గాల కోటాలో, ఆ సీటు మాకంటే.. మాకు కావాలని కొందరు, పొత్తుల్లో భాగంగా మాదేనని ఇంకొందరు, ఇలా ఎవరికి వారు సీటు కోసం పోటీ పడుతున్నారు. అసలు ఇంతకీ టీడీపీ, జనసేనలో ఈ సీటుకి అంత డిమాండ్ ఎందుకురా బాబూ అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టిడిపి విజయం సాధించింది. అంతకు ముందు కూడా అనేక మంది ఈ నియోజకవర్గం నుంచి గెలిచినా 2019 ఎన్నికలను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు టిడిపి నాయకులు.
ఎందుకంటే టీడీపీ హిస్టరీలో 2019 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఘోరమైన ఓటమి. అలాంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ స్థానాన్ని నాలుగు వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచింది టీడీపీ. 2019లో జనసేన కూడా ఇక్కడ బరిలో నిలిచి 28 వేల వరకు ఓట్లను చీల్చేసింది. దీంతో అప్పుడే అలా ఉంటే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి జత కట్టాయి. అందువల్ల భారీ మెజార్టీ వస్తుందనీ, గెలుపు గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతున్నారట టీడీపీ, జనసేన నాయకులు. అందుకే గుంటూరు పశ్చిమ స్థానం కోసం పోటీ ఎక్కువైపోతోంది. దీనికితోడు జిల్లాలో ఎక్కడ సీటు ఖాళీ చేయాల్సి వచ్చినా ఈ సీటు కాకపోతే నాకు గుంటూరు పశ్చిమ స్థానం ఉంది, అక్కడైతే గెలుపుని ఎవరూ ఆపలేరంటూ కామెంట్ చేస్తున్నారట టిడిపి నాయకులు. ఇప్పటికే ఇక్కడ ఇన్చార్జిగా కోవెలమూడి రవీంద్ర ఉన్నారు. ఆయనకు సీటు వస్తుందో రాదో తెలీదుగానీ మిగతా వాళ్ళంతా ఇక్కడికే క్యూలు కడుతున్నారు. ఇందులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో పాటు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ కుటుంబం నుంచి ఆమె కోడలు రాజకుమారి, ఓ మాజీ మహిళా ఐఏఎస్‌తో పాటు ఒకరిద్దరు ఎన్నారైలు పోటీ పడుతున్నారు. దీంతో అసలు గుంటూరు వెస్ట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు? సీటు టిడిపికి వస్తుందా, జనసేనకి పోతుందా, జనసేనకు కేటాయించాల్సి వస్తే అభ్యర్థి ఎవరన్న చర్చ జరుగుతోంది.
TDP Family Politics: ఫ్యామిలీ ప్యాకేజీలు.. టీడీపీకి తలనొప్పిగా ఫ్యామిలీ పాలిటిక్స్
టిడిపి కూటమి నుంచి పోటీ చేసేది ఎవరు అనే ప్రశ్న మాత్రం నాయకుల్నే కాకుండా కేడర్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎందుకంటే వైసిపి ఇప్పటికే తన మొదటి ఎత్తుగా పశ్చిమ సీటును మంత్రి విడుదల రజినికి కన్ఫర్మ్ చేసేసింది. వార్డుల పర్యటన కూడా చేస్తున్నారు మంత్రి. విడదల రజిని చరిష్మాను తట్టుకునే విధంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థిని అన్వేషించడానికి టీడీపీ ప్రయత్నిస్తుంటే.. చాన్తాడంత పెరిగిపోతున్న లిస్ట్ మాత్రం కలవరపెడుతుంది. ఇందులో ఎవరికి సీటు ఇచ్చినా మిగిలిన వాళ్ళంతా బాధపడే పరిస్థితి ఉంటుంది. అలాగే కామ్‌గా సైడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోందట టీడీపీ అధినాయకత్వం. మరి కత్తెరకు ఎలా పదును పెడుతుందో చివరికి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.