Chandrababu: చంద్రబాబు మనసులో మాట సరే.. మోదీ దగ్గరకు తీసుకుంటారా..?
ఏ చిన్న అవకాశం దొరికినా తనకు తగ్గట్టు సిచ్యుయేషన్ ను మార్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా అలాగే చేశారు. మోదీపై ప్రశంసల వర్షం కురింపించారు. దీంతో ఆయన మళ్లీ బీజేపీ గూటికి చేరబోతున్నారేమో అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
బీజేపీతో దోస్తీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తహతహలాడిపోతున్నారు. ప్రధాని మోదీ విధానాలు బాగున్నాయని.. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారీతీశాయి. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు, బీజేపీ కూటమిలో చేరేందుకు చంద్రబాబు గట్టిగా ట్రై చేస్తున్నారని.. అందుకే ఆయన అలా మాట్లాడారని చెప్పుకోవచ్చు. చంద్రబాబును అందరూ రాజకీయ చాణక్యుడిగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి మాట వెనుకా ఏదో ఒక వ్యూహముంటుంది. ఇప్పుడు కూడా వ్యూహాత్మకంగానే చంద్రబాబు అలా మాట్లాడి ఉండొచ్చని టీడీపీ శ్రేణులు కవర్ చేసుకుంటున్నాయి.
అయితే ఏ ఎండకాగొడుగు పట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తులు. 2014లో బీజేపీతో కలిసి పనిచేశారు చంద్రబాబు. రాష్ట్ర విభజన సమయం కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి ఉండడం రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆయన భావించి ఉండొచ్చు. రాజధాని, ప్రత్యేక హోదా.. పేరుతో నిధులు రాబట్టుకోవచ్చనుకున్నారు. రాజదానికి ఓ మోస్తరు నిధులు సాధించుకున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వలేం.. ప్యాకేజీ ఇస్తాం అంటే సరేనన్నారు. ఇంకా ఇంకా కావాలన్నారు. అయితే కేంద్రంలో బీజేపీతో సంబంధాలు బెడిసికొట్టడంతో నాలుగేళ్లు తిరిగేసరికి బీజేపీ కూటమికి గుడ్ బై చెప్పేశారు. ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పి.. నిధులు తీసుకుని.. హోదా కోసం బయటికొచ్చానన్నారు.
బీజేపీతో కటీఫ్ చెప్పారు సరే.. కామ్ గా ఉండకుండా బద్ధశతృవైన కాంగ్రెస్ తో కలిశారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా.. అలాంటి పార్టీతో వెళ్లి జతకట్టారు. చివరకు 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి టీడీపీని ముప్పతిప్పలు పెడ్తున్నారు జగన్. కేంద్రంలో కూడా మళ్లీ మోదీనే అధికారంలోకి రావడంతో చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. అప్పటి నుంచి బీజేపీతో సఖ్యతకోసం పరితపిస్తున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం చంద్రబాబును దరిదాపులకు కూడా రానివ్వట్లేదు. ఎంతోమందితో రాయబారాలు పంపించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇప్పుడు ఓ జాతీయ చానల్ నిర్వహించిన సెమినార్ లో పాల్గొనే అవకాశం లభించింది చంద్రబాబుకు. అంతే.. తన మనసులో మాట బయట పెట్టేశారు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని.. ఆయన గ్రేట్ అని చెప్పుకొచ్చారు. ఆయన విధానాల వల్లే ప్రపంచంలో భారతదేశం గురించి అందరూ చర్చించుకుంటున్నారన్నారు. ఇదే దూకుడు కొనసాగిస్తే 2050 నాటికి దేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా తనకు తగ్గట్టు సిచ్యుయేషన్ ను మార్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా అలాగే చేశారు. మోదీపై ప్రశంసల వర్షం కురింపించారు. దీంతో ఆయన మళ్లీ బీజేపీ గూటికి చేరబోతున్నారేమో అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. టీడీపీ కూడా బీజేపీతో దోస్తీ కోసం ఎంతో ట్రై చేస్తోంది. కానీ బీజేపీ చంద్రబాబును అక్కున చేర్చుకుంటుందా.. అనేదే పెద్ద ప్రశ్న.