Fake Votes: ఏపీలో 20లక్షల దొంగ ఓట్లు

20లక్షల ఓట్లంటే ఏపీ ఓటర్లలో దాదాపు 5శాతం. అంటే ఐదుశాతం మంది లేని ఓటర్లు అధికార పక్షానికి ఓటేస్తారన్నమాట. ఇవన్నీ గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడిపోతాయి. పోనీ ప్రతిపక్షమే దొంగ ఓట్లు చేర్పించిందనుకుందాం. కానీ ఎక్కడా అధికారపక్షం నేతలు దీనిపై ఫిర్యాదులు చేయడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 30, 2023 | 12:14 PMLast Updated on: Jun 30, 2023 | 12:14 PM

Tdp Complaints On Fake Votes To Election Commission In Andhra Pradesh

ఏపీలో 20 లక్షలకు పైగా దొంగ ఓట్లున్నాయట. బాబోయ్ అనకండి… ఏదో సంఖ్యని ఎక్కువ చేసి చెబుతున్నారనుకోకండి… కాస్త అటూ ఇటుగా ఆ స్థాయిలోనే ఏపీలో దొంగ ఓట్లున్నాయన్నది మాత్రం నిజమంటున్నారు… అందుకు సాక్ష్యాలు కావాలంటే అక్కడా ఇక్కడా అవసరం లేదు. ఎక్కడ వెతికినా అక్కడ దొంగ ఓట్లు బయటపడుతూనే ఉన్నాయి.

ఎన్నికలు వచ్చినప్పుడు దొంగ ఓట్లు అన్న గొడవ ఎప్పుడూ ఉండేదే…. అధికారపక్షం కొన్ని దొంగ ఓట్లను చేర్పించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్న ఆరోపణ వస్తూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఉంది. నవ్విపోదురు గాక నాకేటి అన్నట్లు అధికార ఫ్యాను పార్టీ భారీగా దొంగ ఓట్లను చేర్చిందన్నది పెద్ద ఆరోపణ. ఇవి కేవలం ఆరోపణలే అని కొట్టి పారేయడానికి వీల్లేదు. రోజుకో చోట దీనికి సాక్ష్యాలు బయటపడుతూనే ఉన్నాయి.

ఒకే ఇంటి నెంబర్‌తో కొన్ని వందల ఓట్లుంటాయి. ఇద్దరే ఓటర్లున్న ఇంట్లో మరో 80మందికి కొత్తగా ఓటు వచ్చేస్తుంది. ఇంకా విచిత్రమేమిటంటే ఇంటి నెంబర్లు లేకుండానే ఓట్లు చేరిపోయాయి. వైసీపీ గట్టి మద్దతుదారుల ఇళ్లలోనే ఇలా భారీగా దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. నర్సరావుపేటలోని ప్రకాశ్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఏకంగా 243 ఓట్లు నమోదయ్యాయి. మరో దాంట్లో 148, ఇంకో దాంట్లో 80 ఓట్లు వచ్చాయి. గుంటూరులో ఓ చిన్న ఇంట్లో 90మందికి ఓటున్నట్లు గుర్తించిన టీడీపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై విచారణ జరిపిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. విజయవాడలోనూ అదే పరిస్థితి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికారపక్షం ఈ జిమ్మిక్కులు భారీగానే చేసింది. వాటి లెక్క తేల్చే పనిలో ప్రతిపక్ష టీడీపీ పడింది. ఇప్పటివరకు 20లక్షల దొంగ ఓట్లను గుర్తించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అంటే ఇంకా తవ్వితే మరిన్ని బయటపడతాయేమో. ప్రతిపక్షం కాబట్టి కాస్త సంఖ్య ఎక్కువ చేసి చెప్పి ఉండొచ్చు కానీ దొంగ ఓట్లు మాత్రం భారీగానే ఉన్నాయన్నది మాత్రం ఎన్నికల సంఘం కూడా అంగీకరిస్తున్న వాస్తవం. దీనిపై వచ్చే ఫిర్యాదుల్ని చూస్తే వాటిని ఎలా పరిష్కరించాలో అర్థం కాక తలపట్టుకుంటోంది. బయటకు వచ్చేవే ఇన్నైతే రానివి ఇంకెన్నో…

ఎన్నికల్లో లబ్ది కోసం అధికారపక్షం మరీ శృతిమించినట్లు కనిపిస్తోంది. చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా అడ్డుకుంది. అంతేకాకుండా టీడీపీకి అనుకూలం అని భావించిన వారి ఓట్లను వాలంటీర్ల సాయంతోనే తొలగించారన్న ఆరోపణలున్నాయి. ఓ బూత్‌ నుంచి మరో బూత్‌కు ఓట్లు మార్పించడం వంటి పనులకూ పాల్పడ్డారు.

ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే… ఒక్కోసారి స్వల్ప తేడాతో అభ్యర్థులు ఓడిపోతుంటారు. 1989లో అనకాపల్లి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ టీడీపీ అభ్యర్థిపై కేవలం 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీన్ని బట్టి ప్రతి ఓటు ఎంత కీలకమో అర్థమవుతుంది. చాలాచోట్ల వందల ఓట్లతేడాతో అభ్యర్థులు బయటపడుతుంటారు. ఈసారి టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందన్న అంచనాలున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల తేడా తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ నేతలు కూడా తమకు సీట్లు భారీగా తగ్గుతాయని ప్రైవేట్ చర్చల్లో అంగీకరిస్తున్నారు. అధికారపక్షంపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో వైసీపీ ఈ దొంగ ఓట్ల అస్త్రాన్ని ఎంచుకుంది. ప్రతి నియోజకవర్గంలోనూ 5 నుంచి 10వేల ఓట్లను అదనంగా చేర్చేశారు. వాటిలో కొన్ని తొలగించినా మిగిలిన ఓట్ల సాయంతో గట్టెక్కొచ్చన్నది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 5-6వేల ఓట్లు తమకు అనుకూలంగా వేయించుకుంటే 20-30 స్థానాల్లో ఫలితాన్ని తారుమారు చేయవచ్చన్నది వ్యూహంగా కనిపిస్తోంది. దీన్ని గుర్తించే టీడీపీ జాగ్రత్త పడుతోంది. దొంగ ఓట్ల లెక్కలు గ్రామాల వారీగా తీయిస్తోంది. ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తోంది.

20లక్షల ఓట్లంటే ఏపీ ఓటర్లలో దాదాపు 5శాతం. అంటే ఐదుశాతం మంది లేని ఓటర్లు అధికార పక్షానికి ఓటేస్తారన్నమాట. ఇవన్నీ గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడిపోతాయి. పోనీ ప్రతిపక్షమే దొంగ ఓట్లు చేర్పించిందనుకుందాం. కానీ ఎక్కడా అధికారపక్షం నేతలు దీనిపై ఫిర్యాదులు చేయడం లేదు. దీంతో ఈ కుట్రంతా తాడేపల్లి నుంచే జరిగినట్లు అర్థమవుతోంది.