TDP AI Anchor: న్యూస్ ఛానెల్స్ కంటే స్పీడ్‌గా టీడీపీ.. ఏఐ యాంకర్‌ను ఎందుకు సృష్టించారు..?
చంద్రబాబు.. పార్టీలోనూ టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటున్నారు. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందరికంటే ముందే అందుకున్నారు చంద్రబాబు. రాజకీయాల్లోనూ ఏఐని ఉపయోగించొచ్చు అని ప్రూవ్ చేశారు.
TDP AI Anchor: కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.. చంద్రబాబులా..! తమ అధినేత గురించి టీడీపీ వర్గాలు పదేపదే చెప్పే మాటలే అవి. పూర్తిగా నిజమా కాదా అన్న సంగతి ఆలోచిస్తే.. ఎంతో కొంత నిజమ అనిపించకమానదు. చంద్రబాబు సీఎంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆజ్యం పోశారు. హైటెక్ సిటీ అని ఓ కలల నగరాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి చంద్రబాబు.. పార్టీలోనూ టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటున్నారు.
ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందరికంటే ముందే అందుకున్నారు చంద్రబాబు. రాజకీయాల్లోనూ ఏఐని ఉపయోగించొచ్చు అని ప్రూవ్ చేశారు. లీసా అని ఒకరు.. మాయ అని ఇంకొకరు ఏఐ యాంకర్‌లను మన దేశపు మీడియా పరిచయం చేస్తుంటే.. పార్టీ కోసం కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన ముద్దుగుమ్మను ప్రవేశపెట్టింది టీడీపీ. వైభవి అని పేరు కూడా పెట్టేసింది. న్యూస్ చానెల్స్ కూడా టెస్టింగ్ స్టేజీలోనే నడుస్తుంటే వాళ్లకు మించి స్పీడ్‌గా ఆలోచించి పార్టీ కార్యక్రమాల కోసం ఏఐ యాంకర్ సేవలు వినియోగిస్తున్నారు చంద్రబాబు. దీంతో ఇదీ విజన్ అంటే.. అని తెగ మురిసిపోతున్నారు తెలుగు తమ్ముళ్లంతా..! లోకేశ్ యువగళం పాదయాత్రలో మొదటిసారి దీన్ని ఆవిష్కరించారు. కనిగిరిలో లోకేశ్ పాదయాత్రకు సంబంధించిన వివరాలతో ఏఐ న్యూస్ యాంకర్ వైభవి.. తొలి బులిటెన్ చదివింది.
విజయవాడ టీడీపీ ఎంపీ రేసులో ఉన్న కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని.. ఏఐ న్యూస్ యాంకర్‌తో.. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను చదివించారు. రాబోయే రోజుల్లో మరింత మంది ఏఐ యాంకర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి వారితో వార్తల తరహాలో పార్టీ కార్యక్రమాల్ని జనాల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. టెక్నాలజీ అంటేనే టాప్ గేర్‌లో దూసుకుపోయే చంద్రబాబు.. ఏఐ న్యూస్ యాంకర్‌లను పరిచయం చేయడం వెనుక రకరకాల వ్యూహాలు కనిపిస్తున్నాయి. ముద్దుగా ఉండే ఏఐ యాంకర్లతో పార్టీ విశేషాలు చదివించి.. వాటిని సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి మరింత స్ట్రాంగ్‌గా తీసుకెళ్లాలన్నది ఒక స్ట్రాటజీ అయితే.. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం మరో టార్గెట్.
ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లాంటి ఛానెళ్లపై ఎల్లో మీడియా అంటూ జగన్ అండ్ కో పదే పదే విమర్శలు గుప్పిస్తోంది. ప్రకటనల విషయంలో ఒకరకంగా ఇబ్బంది కూడా పెడుతోంది. సో.. ఎన్ని రోజులు ఆ ఛానెళ్లు సపోర్టుగా నిలుస్తాయన్నది ఒక క్వశ్చన్ అయితే.. ఇప్పుడు జమానా మారింది. అంతా సోషల్ మీడియాను, టీవీలను మాత్రమే నమ్ముకుంటే అనుకున్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లొచ్చు అంటే కుదరదు. అందుకే ఇప్పుడు ఏఐ యాంకర్‌ను పరిచయం చేసింది టీడీపీ. ఏమైనా చంద్రబాబు వయసులోనే పెద్ద.. ఆలోచనల్లో మాత్రం ఎప్పుడూ యూతే అని మురిసిపోతున్నాయి టీడీపీ వర్గాలు.