TDP Committee: జనసేనతో సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. జనసేన పార్టీతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీని ప్రకటించింది.

Janasena
TDP Committee: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే, రెండు పార్టీల మధ్య ఈ అంశంపై పెద్దగా చర్చలు జరగలేదు. అవగాహన మాత్రమే కుదిరింది. అందువల్ల రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య సమన్వయం చాలా అవసరం. ఈ విషయంలో తాజాగా టీడీపీ నుంచి ముందడుగు పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.
జనసేన పార్టీతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీని ప్రకటించింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్యను కమిటీ మెంబర్స్‌గా ఎంపిక చేశారు. ఈ ఐదుగురు సభ్యులు ఇకపై జనసేనతో సమన్వయానికి కృషి చేస్తారు. ఇరు పార్టీలు కలిసి చేపట్టే కార్యక్రమాలు, రాజకీయ అంశాలు, పొత్తులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. మరోవైపు జనసేన నుంచి టీడీపీతో సమన్వయానికి కమిటీని ప్రకటించాల్సి ఉంది.