TDP-JANASENA: ఈ బంధం నిలబడుతుందా..? పొత్తు వర్కవుట్ అవుతుందా..?

ముఖ్యంగా జనసేన వైపు నుంచి ఓట్‌ షేరింగ్‌ విషయంలో ఆశించిన స్థాయిలో ఫీడ్‌ బ్యాక్‌ రావడం లేదనే చర్చ జరుగుతోంది. టీడీపీతో కలవడం ఎక్కువ మంది జనసేన నేతలకు, కార్యకర్తలకు ఇష్టం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 02:21 PMLast Updated on: Dec 13, 2023 | 2:21 PM

Tdp Janasena Alliance Will Workout Or Not

TDP-JANASENA: టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నా.. అది వర్కవుట్‌ అవుతుందా..? లేదా..? అన్న అనుమానాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రకటన చేసిన తొలి నాళ్ళలో ఆహా.. ఓహో అనుకున్నా.. టైం గడిచేకొద్దీ.. తేడా కొడుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్‌ సభలకు గతంలో మాదిరిగా జనం రాకపోవడం.. పొత్తులపై క్షేత్ర స్థాయిలో రకరకాల చర్చలు జరగడం లాంటివి చూస్తుంటే.. ఎక్కడో తేడా కొడుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా జనసేన వైపు నుంచి ఓట్‌ షేరింగ్‌ విషయంలో ఆశించిన స్థాయిలో ఫీడ్‌ బ్యాక్‌ రావడం లేదనే చర్చ జరుగుతోంది. టీడీపీతో కలవడం ఎక్కువ మంది జనసేన నేతలకు, కార్యకర్తలకు ఇష్టం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.

New Parliament : కొత్త పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన అగంతకులు

ఈ ప్రచారం చేస్తోంది వైసీపీనే అనే భావన తొలి రోజుల్లో వ్యక్తమైనా.. పోను పోనూ అది నిజమేనా..? అని గ్లాస్‌ పార్టీ వర్గాల్లో సైతం చర్చ మొదలైందట. టిక్కెట్‌ కచ్చితంగా వస్తుందనుకున్ననియోజకవర్గాల్లో జనసేన నేతలు జోష్‌లో ఉన్నా.. మిగిలిన చోట్ల మాత్రం పొత్తు గురించి అంతంత మాత్రపు స్పందనే ఉందట. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కోసం జనసేన కేడర్‌ పనిచేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. రెండు పార్టీలు కలిసి క్షేత్ర స్థాయిలో ఎన్ని ప్రోగ్రాంలు చేపట్టినా.. ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నా.. చాలా చోట్ల ఆ ఆత్మీయతంతా.. మీటింగ్‌ల్లోనే తప్ప వాస్తవంలో కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. పైగా క్షేత్ర స్థాయిలో కొందరు వైసీపీ నేతలు ఇదే విషయాన్ని పదే పదే జనసేన నేతలకు నూరిపోస్తున్నారన్న వాదనా ఉంది. ముందు చూపున్న వైసీపీ నేతలు కొంతమంది నేరుగా క్షేత్ర స్థాయి జనసేన నేతలతో టచ్‌లోకి వెళ్తున్నట్టు సమాచారం. ఇది వర్కవుట్‌ అయితే పొత్తు వికటించే పరిస్థితే ఉంటుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఈ తంతు పవన్‌ దృష్టికి చేరిందో.. లేక ముందు జాగ్రత్త తీసుకుంటున్నారోగానీ.. సేనాని తాను పాల్గొంటున్న బహిరంగ సభల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Congress government : ఇప్పుడు ఉంది అసలు ఆట.. ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం..?

దాదాపు ప్రతి సభలోనూ.. తాము ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వివరిస్తున్నారాయన. పొత్తు వల్ల కలిగే లాభాల గురించి చెబుతూనే.. జన సైనికుల ఆత్మగౌరవం తగ్గించేలా ఎలాంటి నిర్ణయాలు ఉండవని పదే పదే క్లారిటీ ఇస్తున్నారు. ఇదే కాకుండా.. పొత్తు విషయంలో తన నిర్ణయంతో విబేధించే వారు తనకు అవసరం లేదని, వాళ్లు తనకు.. జనసేనకు శతృవులతో సమానమంటూ తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారాయన. ఈ క్రమంలో పొత్తుపై పైకి ఎంత చెబుతున్నా.. పవన్‌లోనూ డౌట్లు ఉన్నాయా..? అనే అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయట. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. పవన్‌ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అన్ని విధాలా ఆలోచిస్తారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు పార్టీ నేతలు కొందరు. గతంలో కూడా వివిధ సందర్భాల్లో కేడర్‌కు క్లియర్‌ కట్‌ సంకేతాలు ఇచ్చే దిశగా తన నిర్ణయాలను తూ.చా. తప్పకుండా అమలు చేశారని అంటున్నాయి జనసేన వర్గాలు. తెలంగాణ ఎన్నికలు ముగియగానే.. అక్కడి ఎన్నికల్లో టీడీపీ జనసేన కోసం పని చేయలేదనడంతోపాటు కాపు-కమ్మ ఈక్వేషన్‌ను బలంగా తెరమీదికి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని పవన్‌ ముందే ఊహించారని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. అందుకు తగ్గట్టే వైసీపీ నేతలు ఇదే విషయాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని గుర్తు చేస్తున్నాయి గ్లాస్‌ పార్టీ వర్గాలు.

దీన్ని కంట్రోల్‌లో పెట్టేందుకే పవన్‌ ఈ స్థాయిలో కామెంట్లు.. హెచ్చరికలు చేయాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నాయి. బయట జరుగుతున్న ప్రచారానికి.. ప్రత్యర్థి పార్టీ చేసే రకరకాల విశ్లేషణలకు జనసేన కేడర్‌ ప్రభావితం కాకుండా చూసుకునే క్రమంలో ఓవైపు కార్యకర్తలకు పరిస్థితి అర్థమయ్యేలా చెప్పడంతో పాటు.. హెచ్చరికలు కూడా చేస్తున్నారనేది సదరు నేతల భావన. ఇలా చేయకుంటే పార్టీని గాడిలో పెట్టడం కష్టమని అంటున్నారు. పార్టీలో కొందరు ఎమోషన్‌లో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారనీ.. ఎమోషన్‌లో వచ్చే ఆలోచనలు.. తీసుకునే నిర్ణయాల వల్ల నష్టమే తప్ప.. లాభం లేదనేది ఆ నేతల వాదన. ఇలా పొత్తుపై జనసేన వర్గాల్లో రకరకాలుగా గట్టి చర్చే జరుగుతోందట. చివరికి పవన్‌కు కూడా అనుమానాలు ఉన్నాయనే స్థాయికి వెళ్ళింది ప్రచారం. మరి రెండు పార్టీల అధినాయకత్వాలు దీనికి ఎలా చెక్‌ పెడతాయో చూడాలి.