TDP-JANASENA: టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనతో నిరసనలు.. టిక్కెట్లు రాని నేతల ఆందోళన
టిక్కెట్లు దక్కని నేతలు నిరసనకు దిగుతున్నారు. కొన్నిచోట్ల నాయకులు రాజీనామా చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్తితి కనిపిస్తోంది. అనేక చోట్ల టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు రాజీనామాలకు పాల్పడుతున్నారు.
TDP-JANASENA: టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనతో ఆ పార్టీల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టిక్కెట్లు దక్కని నేతలు నిరసనకు దిగుతున్నారు. కొన్నిచోట్ల నాయకులు రాజీనామా చేస్తున్నారు. గజపతినగరం టీడీపీ ఇన్ ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సీటును టీడీపీ కొండపల్లి శ్రీనివాసరావుకు కేటాయించింది. విశాఖ పశ్చిమ సీటు ఆశించిన పాశర్ల ప్రసాద్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు.
TDP IN RAYALASEEMA: సీమ పాలిటిక్స్.. సీమలో టీడీపీ రెబల్స్ రచ్చ.. ఈ సారైనా సైకిల్ తిరుగుతుందా..?
రాయచోటి నుంచి టిక్కెట్ ఆశించిన రమేష్ రెడ్డి కూడా రాజీనామా చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. కృష్ణా జిల్లా పెడన టిక్కెట్ కాగిత కృష్ణప్రసాద్‌కు కేటాయించడంతో, ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం టిక్కెట్‌ను పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. దీంతో ఇక్కడి నుంచి జనసేన టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే ఉన్న జ్యోతుల నెహ్రూకు దక్కింది. అయితే జ్యోతుల నెహ్రూ గెలుపుకోసం కష్టపడతానన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ టీడీపీ టిక్కెట్ సవితకు కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథికి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయించడంపై టీడీపీలో వివాదం చెలరేగుతోంది. టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాకు టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడతామని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్తితి కనిపిస్తోంది. అనేక చోట్ల టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు రాజీనామాలకు పాల్పడుతున్నారు. ఈ అంశాన్ని ఇరు పార్టీలు ఎలా డీల్ చేస్తాయో చూడాలి.