వర్మ… ఇదేం ఖర్మ…!

శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ... అబ్బే అసలు వెలగదు... అదే SVSN వర్మ... అలియాస్‌ పిఠాపురం వర్మ... ఇలా చెప్పండి ఠక్కున అందరికీ గుర్తుకువస్తారు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 04:50 PMLast Updated on: Mar 11, 2025 | 4:50 PM

Tdp Leader Varma Dispointed In Mlc Posts

శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ… అబ్బే అసలు వెలగదు… అదే SVSN వర్మ… అలియాస్‌ పిఠాపురం వర్మ… ఇలా చెప్పండి ఠక్కున అందరికీ గుర్తుకువస్తారు… ఈ రెబల్‌ లీడర్‌కు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. చెప్పుకున్నా ఆ కష్టం తీరదు… గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ కోసం సీటు త్యాగం చేసిన వర్మ… ఇప్పుడు నాకేంటీ ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీటు వదులుకున్నప్పుడు భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తామని అటు పార్టీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేనాని పవన్‌కళ్యాణ్‌ వర్మకు హామీ ఇచ్చారు. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియని పరిస్థితి… ప్రతిసారీ ఈసారి సీటు గ్యారెంటీ అనుకోవడం ఆ తర్వాత నిరాశకు గురికావడం, బలవంతంగా కోపాన్ని అణుచుకుని మళ్లీ తర్వాతి అవకాశం కోసం ఎదురుచూడటం ఆయనకు అలవాటుగా మారింది.

లేటెస్ట్‌గా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో అందులో ఒకటి తనకు గ్యారెంటీ అని వర్మ ఫిక్స్ అయిపోయారు. కానీ మనసులో మాత్రం ఏదో చిన్న డౌట్… పార్టీ అధినేత హ్యాండ్ ఇస్తారేమోనని… కానీ గతంలో ఇచ్చిన హామీ ఈసారి కచ్చితంగా నిలబెట్టుకుంటారని నమ్మారు… అయితే ఆయన అనుమానమే నిజమైంది. వర్మకు ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నట్లు చెప్పేశారు చంద్రబాబు. కాస్త అర్థం చేసుకో అంటూ పార్టీ నేతలతో చెప్పించారు. దీంతో వర్మ లోపల లోపల రగిలిపోతున్నారు. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి చేశారని అనుచరుల దగ్గర వాపోయారు. హైకమాండ్ మరోసారి బుజ్జగించడంతో పార్టీ ఇబ్బందులు కూడా గుర్తుంచుకోవాలంటూ తన గాయానికి తానే ఆయింట్‌మెంట్ పూసుకున్నారు.

చంద్రబాబు సీటు ఇవ్వకపోవడానికి పలు కారణాలున్నాయి. టీడీపీకి నాలుగు ఎమ్మెల్సీలు గ్యారెంటీ అని అంతా భావించారు. కానీ అది మూడుకు పడిపోయింది. చివరి నిమిషంలో బీజేపీ మా సంగతేంటి అంటూ ఎంట్రీ ఇచ్చింది. దీంతో టీడీపీకి ఓ సీటు తగ్గింది. దాన్ని సాకుగా చూపుతూ ఆశావహులను బుజ్జగిస్తున్నారు చంద్రబాబు. సరే ఇక వర్మకు కూడా అదే విషయం చెప్పారు. ఇప్పటికే ఒక సీటు నాగబాబుకు అంటే ఓసీకి ఇచ్చేశారు. అటు బీజేపీ కూడా మరో కాపు సోము వీర్రాజును నిలబెట్టింది. దీంతో ఇప్పుడు వర్మకు ఇస్తే మూడు అగ్రవర్ణాలకు ఇచ్చినట్లవుతుందని భావించింది టీడీపీ. అందుకే ఇప్పటికి ఇంతే అని సరిపెట్టేశారు.

నిజానికి వర్మకు పిఠాపురంలో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఓసారి రెబల్‌గా పోటీ చేసి గెలిచారు. 2019లో ఓడినా 2024లో గెలుపు గ్యారెంటీ అనుకున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును పవన్‌కు ఇచ్చారు చంద్రబాబు. అయితే వర్మ సహకారం లేకుండా అక్కడ గెలవడం డౌటే కావడంతో ఆయన్ను బుజ్జగించి బతిమాలి దారికి తెచ్చుకున్నారు. మనం గెలవగానే ఏదీ మనం గెలవగానే నీకు ఎమ్మెల్సీ సీటు గ్యారెంటీ, ప్రమోషన్ గ్యారెంటీ అంటూ హామీలు ఇచ్చేశారు. వర్మకు ప్రమోషన్ ఉంటుంది అని అటు పవన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ బహిరంగంగానే ప్రకటించారుసరే తప్పదనుకున్న వర్మ అయిష్టంగానే తలూపారు. పవన్ గెలుపు కోసంకష్టపడ్డారు.ఎన్నికలైపోయాయి. పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఎమ్మెల్సీ హామీ మాత్రం నెరవేరడం లేదు. ఇదే వర్మను తెగ ఇరిటేట్ చేస్తోంది.

వర్మకు సీటు దక్కకపోవడంపై పొలిటికల్ హాట్ సర్కిల్స్‌లో మరో డిస్కషన్ కూడా నడుస్తోంది. అటు జనసేనాని ప్రజంట్ అడ్డా పిఠాపురం. భవిష్యత్తులో కూడా అక్కడే పాతుకుపోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ను మరో పవర్ సెంటర్‌లా తయారు చేయడం పవన్‌కు ఇష్టం లేదా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే పిఠాపురంలో వర్మకు, జనసేన కేడర్‌కు గ్యాప్ ఉంది. ఎవరి రాజకీయాలు వారివే. ఎవరి కుంపట్లు వారివే. గత నెలలో వర్మ చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదమైంది. కష్టపడి సాధించిన విజయానికి గౌరవం ఉంటుందని ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసేసారు. అది నేను పెట్టలేదంటూ కవర్ చేశారు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అది పవన్‌ను ఉద్దేశించే చేసినట్లు భావించారు. ఇప్పుడు వర్మకు అవకాశం ఇస్తే అది జనసేనను ఇరిటేట్ చేసినట్లు అవుతుందేమోనన్న ఆలోచన టీడీపీలో ఉంది. వర్మను ఎమ్మెల్సీని చేస్తే నియోజకవర్గంలో పవన్ తర్వాత ప్రోటోకాల్ ఆయనకే ఉంటుంది. అలాంటప్పుడు అది రెండు పార్టీలకు దూరాన్ని మరింత పెంచుతుందా అన్న భయం ఉంది. అందుకే సాకులు చూపుతూ సైడ్ చేసింది టీడీపీ. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు కోపం తెప్పించి లేనిపోని ఇబ్బందులెందుకని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. మెల్లగా పరిస్థితి కాస్త చల్లారాక ఆలోచిద్దాంలే అన్నది ఆయన ఉద్దేశం.

ఇప్పుడు వర్మది కక్కలేని, మింగలేని పరిస్థితి. పార్టీని ఏమనలేరు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లున్నాయి. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు రాలేరు. పోతా అంటే సరే పో అనే అంటారు. ఆయన లేనంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. అదే పార్టీలో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా సీటు దక్కకపోదన్నది వర్మ ఆలోచన. రెబల్ గా రాజకీయం చేయడం కూడా కష్టమే. అందుకే సర్దుకుపోదాం అంటున్నారు. మళ్లీ మరో అవకాశం వచ్చేవరకు ఇలా ఆశల పల్లకిలో ఊరేగడం మినహా మరేం చేయలేరు వర్మ. ఎందుకంటే ఆయన ఖర్మ అలా కాలిపోయింది.