CID Chief Sanjay Kumar: సీఐడీ చీఫ్‌పై అమిత్‌షాకు ఫిర్యాదు.. షా.. రియాక్షన్ ఏంటి.. ఏం జరగబోతోంది..?

ఐడీ చీఫ్ సంజయ్‌ మీద.. టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఐతే చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో.. సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు.. కేంద్రమంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2023 | 02:36 PMLast Updated on: Sep 28, 2023 | 2:36 PM

Tdp Mp Ram Mohan Naidu Complained To Amit Shah About Ap Cid Chief Sanjay Kumar

CID Chief Sanjay Kumar: చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. వైసీపీ, టీడీపీ మధ్య మాములుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. అలాంటిది చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఆ మంటలు మరింత రాజుకున్నాయ్. కక్ష సాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు ఆ పార్టీ నేతలు. నిరాహార దీక్షలు, ఆందోళనలు, రాస్తారోకోలు.. రాష్ట్రం అంతా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.

జగన్‌ చేతిలో సీఐడీ కీలుబొమ్మలా మారిందని.. దాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ నేతలు పదేపదే వాదిస్తున్నారు. ముఖ్యంగా సీఐడీ చీఫ్ సంజయ్‌ మీద.. టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఐతే చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో.. సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు.. కేంద్రమంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మ‌రీ… సంజయ్ వైసీపీకి తొత్తుగా ప‌నిచేస్తున్నారని ఫిర్యాదులో తెలిపినట్లు తెలుస్తోంది. ఆల్ ఇండియ‌న్ స‌ర్వీస్ రూల్స్ మేర‌కు రాజ‌కీయ ప‌క్షపాతాలు లేకుండా ప‌నిచేయాల్సిన సీఐడీ చీఫ్.. అన్నింటినీ ఉల్లంఘించార‌ని హోంమంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. వైసీపీ కార్యక‌ర్త మాదిరిగా ప‌నిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజ‌య్, సీఎం జ‌గ‌న్ కోసం ప్రతిప‌క్షాల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ చెప్పారు.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబుని అరెస్టు చేసి విచార‌ణ చేయాల్సిన అధికారి.. ఎలాంటి విచార‌ణ జ‌ర‌ప‌కుండానే, స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కి వ్యతిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రెస్‌మీట్లు పెడుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్రమైన నేరంగా ఎంపీ రామ్మోహన్ తెలిపారు. ద‌ర్యాప్తు అంశాలు రూపొందించి.. కోర్టుల‌కి నివేదించాల్సిన బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి.. వైసీపీ నేత‌లా ఢిల్లీ, హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో ప్రెస్‌మీట్లు పెడుతూ ప్రతిప‌క్ష నేత‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారని వివరించారు. అలాగే ద‌ర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకి విడుద‌ల చేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో వివరించారు.

చీఫ్ సంజ‌య్ ఉల్లంఘించిన స‌ర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధ‌న‌లు, అడ్డగోలు ప్రవర్తన‌పై అన్ని ఆధారాల‌ను హోంశాఖ మంత్రికి ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పంపించార‌ని సమాచారం.