Kodela Sivaram: కోడెల శివరాంపై వేటు ఖాయమా…?
సత్తెనపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది. సత్తెనపల్లి టికెట్ ను ఇటీవలే పార్టీలో చేరిన కన్నా లక్ష్మినారాయణకు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కన్నా లక్ష్మినారాయణకు టికెట్ ఇవ్వడాన్ని కోడెల శివరాం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

సత్తెనపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కంచుకోట. అయితే ఆయన హఠాన్మరణం తర్వాత ఆయన తనయుడు కోడెల శివరాం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ దక్కుతుందనుకుని పార్టీ కోసం పని చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు ఇతర నేతలు కూడా సత్తెనపల్లి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే వీళ్లందరినీ కాదని సత్తెనపల్లి టికెట్ ను ఇటీవలే పార్టీలో చేరిన కన్నా లక్ష్మినారాయణకు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కన్నా లక్ష్మినారాయణ సత్తెనపల్లిలోనే మకాం వేసి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు.
కన్నా లక్ష్మినారాయణకు టికెట్ ఇవ్వడాన్ని కోడెల శివరాం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నా లక్ష్మినారాయణకు వ్యతిరేకంగా దశాబ్దాలపాటు తన కుటుంబంతో పాటు పార్టీ కార్యకర్తలు పోరాడారని.. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని శివరాం చెప్తున్నారు. ఇప్పుడు ఆయన్ను పిలిచి టికెట్ ఇవ్వడం సరికాదని.. దీనిపై పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక.. గత నాలుగేళ్లుగా తాను, తన తల్లి చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వట్లేదని.. పార్టీకోసం పనిచేసిన తన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా పల్లెనిద్ర పేరుతో కోడెల శివరాం హడావుడి చేస్తున్నారు.
అయితే కోడెల శివరాం తీరుపై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడంపై గుర్రుగా ఉంది. ప్రస్తుతం నారా లోకేశ్ పాదయాత్ర పల్నాడు జిల్లాలోకి ఎంటరైంది. ఈ నేపథ్యంలో కోడెల శివరాం పార్టీ ఆదేశాలను కాదని ధిక్కరించడంపై 16 మంది కోడెల అనుచరులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకోసం నిబద్దతతో పని చేస్తున్న తమకు నోటీసులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి కనీసం కార్యాలయం ముఖం చూడని కన్నా లక్ష్మినారాయణకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కోడెల మండి పడుతున్నారు. అయితే కోడెల శివరాం తీరు ఇలాగే ఉంటే ఆయనపై వేటు వేసేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.