TDP Mind Game: 40మంది ఎమ్మెల్యేలతో వైసీపీపై టీడీపీ మైండ్‌గేమ్..?
సైకిల్ పార్టీ పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికలతో సీన్ రివర్స్ అయింది. టీడీపీ మళ్లీ దూసుకువచ్చింది. మూడు గ్రాడ్యుయేట్, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెలిచి.. వైసీపీకి సవాల్ విసిరింది.
వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించింది ఇన్నాళ్లు ఏపీ రాజకీయం! ఉపఎన్నికలు అయినా.. స్థానిక ఎన్నికలు అయినా.. ఫ్యాన్ గాలి స్పీడ్‌కు సైకిల్ వెళ్లి షెడ్డులో పడిపోయింది. ఇంత జరుగుతున్నా.. టీడీపీ నుంచి పెద్దగా రియాక్షన్ కనిపించలేదు ఆ మధ్య ! దీంతో తెలుగు తమ్ముళ్లు కూడా కంగారు పడిపోయారు. సైకిల్ పార్టీ పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికలతో సీన్ రివర్స్ అయింది. టీడీపీ మళ్లీ దూసుకువచ్చింది. మూడు గ్రాడ్యుయేట్, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెలిచి.. వైసీపీకి సవాల్ విసిరింది. ఇన్నాళ్లు వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడితే.. ఇప్పుడు టీడీపీ మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. బలం లేకపోయినా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో గెలిచి.. ఇద్దరు వైసీపీ అసంతృప్తులను లాక్కున్న టీడీపీ.. మైండ్‌గేమ్ స్ట్రాటజీకి మరింత పదును పెంచింది.
అసంతృప్తులు అందరూ తమవైపు చూస్తున్నారని.. 40మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అధికార పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. జనసేనతో పొత్తు కూడా దాదాపు ఖాయం కావడంతో.. అందరిలోనూ నమ్మకం పెరిగిందని.. అందుకే వైసీపీలో చాలామంది నేతలు తమవైపు చూస్తున్నారన్నట్లుగా టీడీపీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. మునిగిపోతున్న నావకు చుక్కానిలా.. టీడీపీకి ఎమ్మెల్సీ ఫలితాలు బలం ఇచ్చాయ్. ఆనం, కోటంరెడ్డి కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జై కొట్టడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూడా గెలిచింది. దీంతో మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. వాపును బలుపుగా చూపించే ప్రయత్నం చేస్తూ.. ఫ్యాన్ పార్టీకి ఊపిరి ఆడకుండా చేస్తోంది. నిజంగా 40మంది టచ్‌లో ఉన్నారా.. వాళ్లంతా వచ్చి టీడీపీలో చేరతారా అంటే.. ఇప్పటికిప్పుడు అది సాధ్యం అయ్యే పని కాదు. ఐతే ఈ ప్రచారం మొదలుపెట్టడం ద్వారా.. మానసికంగా వైసీపీ మీద పైచేయి సాధించాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
మైండ్‌గేమ్ సంగతి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయి పరిణామాల మీద టీడీపీ నజర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. అసెంబ్లీలోనూ రిపీట్ అవుతాయని.. వైసీపీని కొట్టేయడం ఈజీ అనుకుంటే.. సైకిల్ పెడల్ మీద రివర్స్‌లో కాలేసినట్లే ! మూడున్నరేళ్లలో క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు చెల్లాచెదురు అయ్యాయ్. వాటిని సెట్‌చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత కనిపిస్తున్న వాపు చూసుకొని, చూపించి.. అదే బలుపు, బలం అనుకుంటే.. చెల్లించక తప్పదు భారీ మూల్యం అన్నది క్లియర్.