టార్గెట్ కొడాలి… సిగ్నల్ వచ్చేసింది..!

ఏపీలో వైసీపీ నేతల విషయంలో కొన్నాళ్లు మౌనం వహించిన రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఎప్పుడు ఎవరిని అదుపులోకి తీసుకుంటుందో... ఎప్పుడు ఎవరిని పోలీస్ శాఖ టార్గెట్ చేస్తుందో అర్థం కాక వైసిపి నేతలు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 07:35 PMLast Updated on: Mar 21, 2025 | 7:35 PM

Tdp Targets To Kodali Nani

ఏపీలో వైసీపీ నేతల విషయంలో కొన్నాళ్లు మౌనం వహించిన రాష్ట్ర ప్రభుత్వం… ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఎప్పుడు ఎవరిని అదుపులోకి తీసుకుంటుందో… ఎప్పుడు ఎవరిని పోలీస్ శాఖ టార్గెట్ చేస్తుందో అర్థం కాక వైసిపి నేతలు సైలెంట్ గా ఉండిపోతున్నారు. వైయస్ జగన్ కూడా ఈ మధ్యకాలంలో పార్టీ నేతలకు పెద్దగా మద్దతు ఇచ్చిన వాతావరణం కనబడలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ దూరంగానే ఉన్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా పార్టీ నేతలకు సమాచారం లేదు.

వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత… కొన్ని రోజులకే పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ జైల్లోనే ఉన్నారు. పోసాని కృష్ణమురళి విడుదలవుతారు అనుకున్నా తర్వాత చివరి నిమిషంలో ఆయనపై మరో కేసు నమోదు అయింది. దీనితో పోసాని జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక వల్లభనేని వంశీ ఎప్పుడు రిలీజ్ అవుతారో కూడా తెలియని పరిస్థితి. ఈ టైంలో మరో కీలక నేత కొడాలి నానిపై పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగానే అర్థమవుతుంది.

తాజాగా ఆయన ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే గుడివాడ పట్టణంలో కొన్ని కీలక ప్రాంతాల్లో భూములను కబ్జా చేసినట్టు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎల్లో మీడియా ఆయనపై కథనాలు కూడా ప్రసారం చేసింది. ఇప్పుడు ఆ కేసులను మొత్తం పోలీసులు బయటికి లాగుతున్నారు. దీంతో అలెర్ట్ అయిన కొడాలి నాని… నమోదైన కేసుల్లో ముందస్తు మెయిల్ కోసం కష్టపడుతున్నారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న నాని… ఇప్పుడు మాత్రం గతంలో నమోదైన కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారు. చంద్రబాబు నాయుడుని, లోకేష్ ను ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత జైలు వద్దకు వెళ్ళిన నాని పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మీడియా వాళ్ళు మాట్లాడిన సరే నాని మాత్రం వెటకారంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు.

ఒకప్పుడు మీడియా ముందుకు వస్తే చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించే నాని ఇప్పుడు మాత్రం అసలు మీడియాకు కనపడకుండా తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో… కొడాలి నాని కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయంగా గుడివాడలో పార్టీ మరింత బలహీనపడుతోంది. ఈ టైంలో నాని దూరంగా ఉండటం పార్టీకి మంచిది కాదు అనే అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. వరుస కేసుల సిద్ధంగా ఉండటంతో నాని తనను తాను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ముందస్తు మెయిల్ కోసం హైకోర్టు గడప తొక్కారు.