Mahanadu: మహానాడుకు వేళాయే.. నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యం!

రాజమండ్రి వేదికగా నేటి నుంచి ఆదివారం వరకు 32వ మహానాడు జరగబోతుంది. మొదటి రోజు ప్రతినిధుల సభ జరగనుండగా, రెండో రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ మహానాడు సాగబోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2023 | 12:53 PMLast Updated on: May 27, 2023 | 3:02 PM

Tdps Mahanadu From Today In Rajahmundry Focusing On Roadmap For 2024 Elections

Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు శనివారం నుంచి ప్రారంభం కానుంది. రాజమండ్రి వేదికగా నేటి నుంచి ఆదివారం వరకు 32వ మహానాడు జరగబోతుంది. రాజమండ్రిలోని వేమగిరి వద్ద ఎన్టీఆర్‌ ప్రాంగణంగా పేరుపెట్టిన విశాలమైన మైదానంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. మొదటి రోజు ప్రతినిధుల సభ జరగనుండగా, రెండో రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సారి మహానాడుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే టీడీపీ వ్యవస్థాపకుడు, మహా నటుడు, ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి. అందుకే ఈ ఏడాది వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తోంది టీడీపీ. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి. మొదటి రోజు 15 వేల మంది పార్టీ ప్రతినిధులు, మరో నలభై వేల మంది వరకు కార్యకర్తలు హాజరవుతారని అంచనా. రెండో రోజు ఆదివారం కూడా భారీ సంఖ్యలో మహానాడుకు తరలివస్తారని అంచనా. దీనికి తగ్గట్లు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక స్థలం దాదాపు 55 ఎకరాల్లో ఉండనుంది. సభా ప్రాంగణాన్ని కూడా భారీగా తీర్చిదిద్దారు. సుమారం 300 మంది వేదికపై కూర్చునే ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి, పరిసర ప్రాంతాలు పసుపు రంగు జెండాలతో నిండిపోయింది.
కీలక తీర్మానాలు
ఈ మహానాడు పార్టీకి చాలా కీలకం కానుంది. 2019లో అధికారం కోల్పోయిన టీడీపీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. అయితే, ఇటీవల కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో పార్టీలో, కార్యకర్తల్లో జోష్ నింపడం చాలా ముఖ్యం. పైగా వచ్చే ఏడాది అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఈ మహానాడును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రబాబు నాయుడుతోపాటు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, బోండా ఉమ, బుద్ధా వెంకన్న వంటి పార్టీ ప్రతినిధులు హాజరవుతారు. అనేక తీర్మానాలపై చర్చ జరిపి, ఆమోదముద్ర వేస్తారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ మహానాడు సాగబోతుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని పార్టీ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భావ సారూప్య పార్టీలతో కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకుంటారు. వైసీపీ పాలనా వైఫల్యాల్ని మహానాడులో ప్రస్తావిస్తారు. టీడీపీ హయాంలో జరిగిన మంచిని కార్యకర్తలకు వివరిస్తారు. పార్టీని ప్రజల్లోకి మరింతగా ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఈ మహానాడు సాగబోతుంది.

mahanadu
సెంటిమెంట్ కలిసొచ్చేనా?
ఈ సారి రాజమండ్రిలో మహానాడు నిర్వహించడం వెనుక ఒక సెంటిమెంట్ కూడా ఉంది. 1993లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో మహానాడుకు ఇక్కడే నిర్వహించారు. ఈ మహానాడుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఆ తర్వాతి ఏడు.. అంటే 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఈ సారి కూడా ఇక్కడ నిర్వహించే మహానాడు విజయవంతమవుతుందని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్ల టీడీపీ విజయం సాధిస్తుందని పార్టీ భావిస్తోంది. టీడీపీ స్థాపించి 41 ఏళ్లు అయినా.. ఇది 32వ మహానాడు మాత్రమే. ప్రతి ఏడూ మహానాడు జరగాలి. అయితే, వివిధ కారణాల వల్ల మధ్యలో తొమ్మిదిసార్లు మహానాడు జరగలేదు. తొలి మహానాడు 1982లో హైదరాబాద్‍లో జరిగింది. ఆ తర్వాత విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, తిరుపతిలో ఈ కార్యక్రమం జరిగింది.
గట్టి బందోబస్తు
టీడీపీ మహానాడుకు ఏపీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 125 ఎకరాల్లో, 12 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం స్థలం కేటాయించినట్లు చెప్పారు.
గోదావరి రుచులు
ఈ మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులు, కార్యకర్తలకు ప్రత్యక భోజన ఏర్పాట్లు చేశారు. తూర్ప గోదావరి రుచుల్ని ప్రత్యేకంగా వడ్డించనున్నారు. మొదటి రోజు సుమారు 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు శాకాహార వంటల్ని అందిస్తారు. ఈసారి తాపేశ్వరం కాజాను ప్రత్యేకంగా అందించనున్నారు.