Botsa Satyanarayana: తెలుగు రాష్ట్రాల మధ్య మాటల మంటలు.. తెలంగాణలో చూచిరాతలన్న బొత్స.. ఏపీ రాజధాని ఏదో చెప్పాలన్న బీఆర్ఎస్

తెలంగాణలో పరీక్షలు చూచిరాతలేనని బొత్స విమర్శిస్తే, ఏపీ రాజధాని ఏదో చెప్పాలని బీఆర్ఎస్ మంత్రులు అంటున్నారు. దీంతో మరోసారి తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి చిచ్చురేగింది. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. బొత్సను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 14, 2023 | 01:34 PMLast Updated on: Jul 14, 2023 | 1:34 PM

Telangana And Andhra Pradesh Ministers Trade Barbs Over Education System

Botsa Satyanarayana: తెలంగాణ, ఏపీ మధ్య మళ్లీ మాటల మంటలు చెలరేగాయి. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఈసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమయ్యాయి. తెలంగాణలో పరీక్షలు చూచిరాతలేనని బొత్స విమర్శిస్తే, ఏపీ రాజధాని ఏదో చెప్పాలని బీఆర్ఎస్ మంత్రులు అంటున్నారు. దీంతో మరోసారి తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి చిచ్చురేగింది. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. బొత్సను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో రెండు రోజుల క్రితం ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా తెలంగాణ విద్యావ్యస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీ విద్యావ్యవస్థను తెలంగాణతో పోలుస్తున్నారు. ఆఫ్ర్టాల్‌ టీఎస్‌పీఎస్సీ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేకపోయారు. అన్నీ చూచిరాతలు, స్కాంలే. అందులో ఎంతమంది ఇన్వాల్వ్‌ అయ్యారో, ఎంతమంది అరెస్టు అయ్యారో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో చివరికి టీచర్ల బదిలీలు కూడా చేసుకోలేని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విద్యారంగంలో ఏపీనే టాప్‌లో ఉంది. మన విధానం మనది. మన ఆలోచనలు మనవి’ అని బొత్స అన్నారు. ఏపీని తెలంగాణ విద్యావ్యవస్థతో పోల్చవద్దని అన్నారు. తెలంగాణలో చూచిరాతలు, స్కాంలు అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు గరం అయ్యారు. మంత్రి బొత్సతోపాటు ఏపీపైనా విమర్శల దాడి చేశారు.
రాజధాని ఏదో చెప్పండి
తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ వంటి నేతలు బొత్సపై నిప్పులు చెరిగారు. మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ ‘‘ఏపీ రాజధాని ఏదీ అంటే చెప్పుకోలేని స్థితిలో ఆ రాష్ట్రం ఉంది. హైదరాబాద్ రాకపోతే ఏపీ నాయకులకు పూట గడవని స్థితిలో ఉన్నారు. మీ రాష‌్ట్రం సంగతి మీరు చూసుకోండి. తెలంగాణ విద్యావ్యవస్థ ఏపీకంటే బాగుంది. తెలంగాణ వస్తే చూపిస్తాం. తెలంగాణ విద్యావ్యస్థను, విద్యార్థుల్ని బొత్స తీవ్రంగా అవమానించారు. బొత్స సత్యనారాయణ పరీక్షల్ని చూసి రాసి ఉంటారు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీపీఎస్సీలో అప్పట్లో స్కాంలు చేసిన చరిత్ర వాళ్లది. డబ్బుల కట్టలతో లాడ్జిలు నిండిపోయేవి. ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి కారణమైన వారిలో బొత్స ఒకరు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అయినా.. తిరుపతిలో అయినా.. ఎక్కడైనా చర్చకు సిద్ధమే. ఏపీ నేతలు తెలంగాణపై ఏవేవో మాట్లాడుతున్నారు. మేం చాలా మాట్లాడగలం. తెలంగాణలో తొమ్మిదేళ్లలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఏపీలో ఎన్ని ఏర్పాటు చేశారో చెప్పాలి’’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు..?
బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ విద్యా వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. ‘‘బొత్స తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ఏపీ విద్యావ్యవస్థ బాగుంటే.. వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు? తెలంగాణలో ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో ఎంత ఖర్చు పెడుతున్నారు? ఏపీలో విభజన సమయంలో 250 గురుకులాలే ఉండేవి. తెలంగాణలో 1,050 గురుకులాలను ఏర్పాటు చేశాం. ఏపీలో ఎన్ని గురుకులాలు ఏర్పాటు చేశారు? తొమ్మిదేండ్లలో రెండుసార్లు ఉపాధ్యాయులను బదిలీ చేశాం. కొందరు టీచర్లు కోర్టుకు వెళ్లడం వల్ల బదిలీ ప్రక్రియ ఆగింది. మీ రాష్ర్టాన్ని మీరు పరిపాలించుకోండి. అంతేకానీ.. తెలంగాణ జోలికి వస్తే ఊరుకోం’’ అని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. మరో మంత్రి గంగుల కమలాకర్ కూడా బొత్సపై, ఏపీపై విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ విద్యావిధానం గురించి మాట్లాడే అర్హత బొత్సకు లేదు. సీట్లను దొడ్డిదారిన అమ్ముకోవడమే కదా.. బొత్స చేసేది. బొత్సను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఇదంతా సీఎం జగన్ ఆడించే నాటకం. ఏపీలో కరెంటు లేదు. పంటలు లేవు’’ అని గంగుల అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య రచ్చ
బొత్స వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చ జరుగుతోంది. అభివృద్ధిపై తెలంగాణ నేతలు బొత్సకు, ఏపీకి సవాల్ విసురుతున్నారు. బొత్స వ్యాఖ్యల వల్ల జరిగే డ్యామేజ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ మంత్రులు ప్రయత్నిస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వంటి అంశాలపై చర్చ జరగకుండా తెలంగాణ మంత్రులు బొత్సకు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ రాజధాని, అభివృద్ధి వంటి అంశాల్లో సవాల్ విసురుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. గతంలో ఎక్కువగా ఏపీపై తెలంగాణ మంత్రులు విమర్శలు చేశారు. రోడ్ల విషయంలో మంత్రి కేటీఆర్, అలాగే విద్యుత్, ఇతర అంశాల విషయంలో హరీష్ రావు సహా పలువురు ఏపీపై విమర్శలు చేశారు. వీటికి బదులిచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఈసారి మాత్రం తెలంగాణపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు చేయడం విశేషం.