ELECTION RESULTS: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. 8 గంటలకు ప్రారంభం..
ఫలితాల ద్వారా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ కోసం 49 కేంద్రాల్ని ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
ELECTION RESULTS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణకు సంబంధించి 119 నియోజకవర్గాల పూర్తి ఫలితాలు సాయంత్రానికల్లా విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల ద్వారా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ కోసం 49 కేంద్రాల్ని ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తెలంగాణలో 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్లకు ఒక టేబుల్ కేటాయించారు. వీటి కౌంటింగ్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణతోపాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఫలితాలు కూడా ఆదివారమే విడుదల కానున్నాయి. అయితే, మిజోరం ఫలితాలు మాత్రం సోమవారం విడుదలవుతాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు ఈసీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించింది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు.. ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. 40 కంపెనీలకు చెందిన భద్రతా బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అభ్యర్థులు సహా పాస్‌లు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. తెలంగాణలో తాజా ఎన్నికల్లో 2,32,59,256 మంది తమ ఓట్లు వేశారు. ఫలితాల కోసం తెలంగాణ ప్రజలతోపాటు పార్టీ నేతలు, అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.