Telangana: ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ.. అక్టోబర్‌లోనే షెడ్యూల్..?

అసెంబ్లీ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు అవసరమవుతాయి. ఓటర్ల జాబితా సవరణ, కొత్త జాబితా ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలను సిద్ధం చేయడం వంటి అనేక అంశాల్ని పరిశీలించాల్సి ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 20, 2023 | 10:31 AMLast Updated on: Jun 20, 2023 | 10:31 AM

Telangana Assembly Elections Shedule To Be Announced On October

Telangana: తెలంగాణలో అసెంబ్లీకి మరో ఆరు నెలలలోపే ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు అవసరమవుతాయి. ఓటర్ల జాబితా సవరణ, కొత్త జాబితా ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలను సిద్ధం చేయడం వంటి అనేక అంశాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని ఎంపికి చేసి, వారికి ముందుగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమైంది. ఈ పనులన్నిటికీ కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈసారి జిల్లా అడిషనల్ కలెక్టర్లను కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనేలా చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మొత్తం 74 మంది డిప్యూటీ కలెక్టర్లు, 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 31 మంది అడిషనల్ కలెక్టర్ల తో జాబితా రెడీ చేసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న తహసిల్దార్లకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా విధులు కేటాయించనున్నారు. నామినేషన్లు స్వీకరణ, పోలింగ్ సామగ్రి సరఫరా, తరలింపు, పోలింగ్‌బూత్‌ల ఏర్పాటు, ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు రెడీ చేయడం వంటి విధుల్ని వీళ్లు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఓటర్ల జాబితా తర్వాతే షెడ్యూల్
ఎన్నికలకు ముందు ఓటర్ల తది జాబితా సిద్ధం చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. ఆ తర్వాతే ఇదే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్, నవంబర్‌లో నోటిఫికేషన్ రావొచ్చు. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్ తొలి వారంలోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో డిసెంబర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. తెలంగాణతోపాటు ఈ ఏడాది మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు ఏపీలో కూడా ప్రభుత్వం ముందస్తుకు వెళ్తే ఈ ఏడాదే ఎన్నికలు రావొచ్చు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాజకీయంగా పార్టీలన్నీ యాక్టివ్‌గా ఉంటున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఎన్నికలు మారొచ్చు. పార్టీలో కొత్త జోష్ వస్తే తప్ప బీజేపీ మూడో స్థానానికే పోటీ పడాల్సి ఉంటుంది.