Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా అసలేం చెప్పారు..?
బీజేపీ పెద్దల దూకుడు చూస్తుంటే త్వరలోనే మద్యం కుంభకోణంలో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే నేషనల్ పాలిటిక్స్ తో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా మరింత వేడెక్కుతాయి. సమ్మర్ హీట్ ను మించిన పొలిటికల్ హీట్ ను చూడొచ్చు...
తెలంగాణ బీజేపీ నేతలను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించిన కమలం పెద్దలు రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారు. ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. మీటింగ్ ముగియగానే ఎప్పట్లానే ఇది మామూలు సమావేశమే అని చెప్పారు తెలంగాణ బీజేపీ ముఖ్యులు.. లోపలేం జరిగిందన్నది బయట పెట్టలేదు. పార్టీ తరపు నుంచి మామూలుగానే అలా చేయండి, ఇలా చేయండి అంటూ అమిత్ షా చెప్పారంటూ లీకులు వచ్చాయి. కానీ నిజంగా లోపల ఏం జరిగింది…? తెలంగాణ బీజేపీ నేతలకు అసలు అమిత్ షా ఏం చెప్పారు…? లిక్కర్ కేసుపై క్లారిటీ ఇచ్చేశారా…? యుద్ధానికి అస్త్రాలు సిద్ధం చేయమని సంకేతాలు ఇచ్చేశారా…?
తెలంగాణలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగులు చివరిదశకు చేరుకున్న సమయంలో అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించడం ఆసక్తిని రేపింది. పైగా లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టైన వెంటనే ఈ పిలుపు వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ ఒక్కచోట చేర్చితే తెలంగాణ నేతలకు పిలుపు వెనక వేరే కారణాలున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.
మనీష్ సిసోడియా అరెస్టుతో లిక్కర్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూపులో మిగిలిన పెద్ద తలకాయ ఎమ్మెల్సీ కవిత, ఏపీ ఎంపీ మాగుంటలే… కానీ మాగుంటపై ఇప్పటికే పెద్దగా ఫోకస్ పడలేదు. ఆయన్ను దర్యాప్తు సంస్థలు పూర్తిగా విచారించలేదు. కవితను ఇప్పటికే ఓసారి విచారించారు కూడా. మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారు కానీ డేట్ ఇవ్వలేదు. వీటన్నింటిని బట్టి చూస్తే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. విజయ్ నాయర్ ద్వారా ఆప్ నేతలకు సౌత్ గ్రూపు నుంచి వందల కోట్ల ముడుపులు చేరాయన్నది ఆరోపణలకి సంబంధించి ఈడీ, సీబీఐలు స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కాబట్టి అెరెస్టుల వార్తలు కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై చర్చించడానికే తెలంగాణ బీజేపీ నేతలను హైకమాండ్ హుటాహుటిన పిలిపించినట్లు తెలుస్తోంది.
కవితను అదుపులోకి తీసుకుంటే తెలంగాణలో పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపైనే హైకమాండ్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కమలం నేతలు కాస్తో కూస్తో ఆశలు పెట్టుకున్నది తెలంగాణపైనే.. గతంతో పోల్చితే ఇక్కడ బాగానే బలం పుంజుకున్నామని బీజేపీ భావిస్తోంది. అలాంటిచోట ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే ఏమైనా పరిస్థితి మారుతుందా అన్నది హైకమాండ్ ఆరా తీస్తోంది. ఏమైనా సెంటిమెంట్ రేగి అది బీఆర్ఎస్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలూ బీజేపీ పెద్దలకు లేకపోలేదు. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు ఎంతో కొంత డ్యామేజ్ చేసిందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు అంత ఈజీగా అర్థం కావని బీజేపీ పెద్దలకు తెలుసు… ఫామ్ హౌజ్ కేసులోనూ కేసీఆర్ చక్రం ఎలా తిప్పారో తెలుసు…. అందుకే కవితను అరెస్టు చేస్తే దాన్ని ఆయన తన లైఫ్ లైన్ గా మార్చుకుంటారా అన్న భయం బీజేపీ పెద్దలకు ఉంది. సెంటిమెంట్ తో కొట్టడంలో కేసీఆర్ దిట్ట… ఇప్పుడు దాన్ని అనుసరిస్తే… తెలంగాణలో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఏమైనా ప్రభావం పడుతుందా అని హైకమాండ్ ను కలవరపెడుతోంది. అందుకే అన్ని అంశాలనూ బేరీజు వేస్తోంది. రాష్ట్ర నేతల నుంచి సమాచారం తీసుకుంటోంది. కేంద్ర పెద్దలు ఈ దిశగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని బేరీజు వేసుకుని ఏం చేయాలనేదానిపై ముందుకు వెళ్లాలని కమలం పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్ర నేతలకు మాత్రం ఏం జరిగినా సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ దాడికి దిగితే ఎదురుదాడికి వ్యూహాలు కూడా ఖరారు చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది.
బీజేపీ పెద్దల దూకుడు చూస్తుంటే త్వరలోనే మద్యం కుంభకోణంలో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే నేషనల్ పాలిటిక్స్ తో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా మరింత వేడెక్కుతాయి. సమ్మర్ హీట్ ను మించిన పొలిటికల్ హీట్ ను చూడొచ్చు..!