TELANGANA BJP: మోదీ, అమిత్ షాతో బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్.. బీజేపీ గాడిన పడేనా..?

రాబోయే రెండు నెలల్లోనే పార్టీకి జోష్ తేవాలి. అదంత సులభం కాదు. అయినప్పటికీ, బీజేపీ గట్టి ప్రయత్నాలే చేయబోతుంది. దీనిలో భాగంగా ప్రచారంతో హోరెత్తించబోతుంది. భారీ బహిరంగ సభలు, ర్యాలీల ద్వారా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 22, 2023 | 05:46 PMLast Updated on: Sep 22, 2023 | 5:46 PM

Telangana Bjp Leaders Wants To Campaign With Modi Amit Shah

TELANGANA BJP: నిన్నా, మొన్నటి వరకు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంలా కనిపించిన బీజేపీ తెలంగాణలో ఒక్కసారిగా చతికిలపడిపోయింది. అధికారం దక్కడం.. కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం కాదు కదా.. కనీసం సింగిల్ డిజిట్ సీట్లు దాటితేనే గొప్ప అనేలా ఉంది పరిస్థితి. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడంతోనే ఆ పార్టీ పరిస్థితి మారిపోయింది. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక మునుపటిలా బలహీనంగా తయారైంది పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీకి జోష్ తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తెలంగాణలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది.
అన్నీ కుదిరితే తెలంగాణలో రెండు నుంచి మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాబోయే రెండు నెలల్లోనే పార్టీకి జోష్ తేవాలి. అదంత సులభం కాదు. అయినప్పటికీ, బీజేపీ గట్టి ప్రయత్నాలే చేయబోతుంది. దీనిలో భాగంగా ప్రచారంతో హోరెత్తించబోతుంది. భారీ బహిరంగ సభలు, ర్యాలీల ద్వారా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఆధ్వర్యంలో తెలంగాణలో భారీ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. మోదీ, అమిత్ షా, నద్దా.. ఒకరి తర్వాత ఇంకొకరు వరుసగా సభల్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిద్ధం చేస్తోంది. ఈ సభల ద్వారా క్యాడర్‌తో పాటు ప్రజల్లో బీజేపీపై సానుకూలత పెంచాలనుకుంటోంది. ఈ ప్రచారంలో బీజేపీ సాధించిన కీలక విజయాల్ని నేతలు ప్రస్తావించబోతున్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఈ బిల్లు గురువారం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
బస్సు యాత్ర రద్దు..
నిజానికి అగ్ర నాయకత్వంతో భారీ సభలు నిర్వహించడానికి బదులుగా తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని బీజేపీ భావించింది. ఈ నెల 26 నుంచి అక్టోబరు వరకు బస్సు యాత్ర నిర్వహించాలనుకుంది. దీనికోసం అన్ని నియోజకవర్గాలకు కవర్ చేసేలా రూట్ మ్యాప్ కూడా రూపొందించింది. అయితే చివరి నిమిషంలో బీజేపీ నాయకత్వం బస్సుయాత్రను రద్దు చేసుకుంది. యాత్రలకన్నా అగ్రనేతల బహిరంగ సభలతోనే ప్రయోజం ఉంటుందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాలు, లోక్‌సభ నియోజకవర్గాలు కవరయ్యేలా సభలకు ప్లాన్ చేస్తోంది. రాబోయే 2, 3 వారాల్లోనే వరుస సభలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే నెల మొదటి వారంలోనే ప్రధాని మోదీ పర్యటన ఉంటుంది. ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో కనీసం రెండుచోట్ల రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మిగతా ఉమ్మడి జిల్లాల్లో అమిత్‌ షా, నద్దా ర్యాలీలు, సభలు ఉంటాయి.

అగ్ర నాయకత్వంతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో వరుసగా పర్యటిస్తారు. దీని ద్వారా తెలంగాణ బీజేపీ నాయకత్వం, కార్యకర్తల్ని ఎన్నికలకు సిద్ధం చేయాలని భావిస్తోంది. సభలు, ర్యాలీల్లో ప్రధానంగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం వైపల్యాలు, అవినీతి అక్రమాలు, కుటుంబ రాజకీయాలను ఎండగట్టబోతున్నారు. వరుసగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా చేయాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ చివర్లో.. లేదా డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ ఎన్నికలు జరగొచ్చు.