TBJP: టార్గెట్ 5.. టీ బీజేపీ బిగ్ ప్లాన్…!
తెలంగాణలో బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి దిగే స్థాయిలో నేతలు లేరు. ఇప్పటికిప్పుడు నేతలను తయారు చేయలేదు కాబట్టి ఇతర పార్టీల్లో కాస్త పేరున్న, జనానికి కాస్తో కూస్తో పరిచయం ఉన్న నేతలను తనవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ బీజేపీ చేరికలపై ఫోకస్ పెట్టింది. మిగిలిన పార్టీల్లోని నేతలకు గాలం వేస్తోంది. టార్గెట్-5 అంటూ హైకమాండ్ రాష్ట్ర నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ ఏంటా టార్గెట్-5. అది వర్కవుట్ అవుతుందా…? పార్టీకి అధికారాన్ని కట్టబెడుతుందా..?
కొంతకాలం క్రితం వరకూ దూకుడుగా కనిపించిన తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా సైలెంటైపోయింది. దూకుడు తగ్గింది. కార్యకర్తల్లో అయోమయం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు మారాడు. పాత కాపు పోయి కొత్త కాపు వచ్చాడు. కానీ పార్టీలో ఊపు లేదు. దీంతో పార్టీ హైకమాండ్ కొత్త ప్లాన్ వేసింది. పార్టీలో చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారానికి కనీసం ఐదుగురు నేతలకైనా కండువా కప్పాలని టార్గెట్ పెట్టుకుంది. ఒకేసారి చేరికలు కాకుండా నిత్యం చేరికలు ఉండేలా చూడాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు ఇచ్చింది.
ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ , ఖమ్మం జిల్లాలపై కమలం నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తారని భావించారు. కానీ ఆయన హ్యాండ్ ఇచ్చారు. దీంతో మిగిలిన నేతలకు వల వేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను పార్టీలోకి లాగే పనిలో పడ్డారు రాష్ట్ర నేతలు. ముఖ్యంగా ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రులను టార్గెట్ చేసింది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కమలం పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో కీలకంగా ఉండి టికెట్లు రాక లేక రాబోయే ఎన్నికల్లో టికెట్లు రావని డిసైడైన నేతలను పార్టీలోకి తీసుకురావాలన్నది బీజేపీ ఆలోచన. అలాంటి వారితో నిరంతరం చర్చలు జరుపుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన ఏపీ వ్యవహారాలపై ఫోకస్ పెడతారని అంతా అనుకున్నా ఆయన మాత్రం తెలంగాణను టార్గెట్ చేశారు. తను సీఎంగా చేసినప్పుడు తనకున్న పరిచయాలను ఉపయోగించుకుంటూ నేతలను పార్టీలోకి ఆకర్షించే పనిలో పడ్డారు. పలువురు మాజీ మంత్రులతో ఆయనే నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చేరికలకు సంబంధించి పార్టీ హైకమాండ్ కూడా నేరుగా ఆయనతోనే మాట్లాడుతున్నట్లు సమాచారం. అటు అంగబలం, ఇటు అర్థబలం ఉన్న 15మంది నేతలు కిరణ్‌కుమార్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల కాంగ్రెస్‌లోకి వెళతారని ప్రచారం జరిగిన ఓ పెద్ద నేత కూడా బీజేపీవైపు చూస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి దిగే స్థాయిలో నేతలు లేరు. ఇప్పటికిప్పుడు నేతలను తయారు చేయలేదు కాబట్టి ఇతర పార్టీల్లో కాస్త పేరున్న, జనానికి కాస్తో కూస్తో పరిచయం ఉన్న నేతలను తనవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం కూడా లేదు. కాబట్టి ఆపరేషన్ కమలం జోరుగా సాగిస్తోంది. వరుసగా నేతలను చేర్చుకోవడం ద్వారా ప్రజల్లో బీజేపీపై చర్చ జరిగేలా చూడాలని భావిస్తోంది. మరి బీజేపీకి ఈ టార్గెట్-5 వర్కవుట్ అవుతుందో లేదో చూడాలంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే.