CM KCR: 115 మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల.. ఏడుగురు సిట్టింగులకు టిక్కెట్లు నిరాకరణ..!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాకు సంబంధించి సిట్టింగుల్లో పెద్దగా మార్పులు చేయలేదన్నారు. 115 మంది అభ్యర్థుల జాబితాన కేసీఆర్ ప్రకటించారు. నాలుగు స్థానాలకు మాత్రం పెండింగ్‌లో ఉంచారు.
CM KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జాబితా ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాకు సంబంధించి సిట్టింగుల్లో పెద్దగా మార్పులు చేయలేదన్నారు. 115 మంది అభ్యర్థుల జాబితాన కేసీఆర్ ప్రకటించారు. నాలుగు స్థానాలకు మాత్రం పెండింగ్‌లో ఉంచారు.
నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్, జనగాం స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించారు. స్టేషన్ ఘన్‌పూర్, వేములవాడ, బోథ్, ఉప్పల్, వైరా, ఖానాపూర్, ఆసిఫాబాద్ వంటి ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మాత్రమే మారుస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుగురు సిట్టింగులకు సీట్లు నిరాకరించారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి రెండు చోట్లా పోటీ చేస్తారు. కామారెడ్డి నుంచి ప్రస్తుతం గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో కేసీఆర్ పోటీ చేస్తారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్ పోటీ చేస్తారు. వేములవాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్థానంలో చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకు టిక్కెట్ కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేస్తారు.
హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి, దుబ్బాకలో ప్రస్తుత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు. ఆసిఫాబాద్‌లో ప్రస్తుతం ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. ఆయన స్థానంలో కోవా లక్ష్మి పోటీ చేస్తారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో బానోత్ మదన్‌లాల్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానంలో భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావు స్థానంలో అనిల్ జాదవ్ పోటీ చేస్తారు. రాబోయే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందనే ధీమాను కేసీఆర్ వ్యక్తం చేశారు.