CM KCR: కేసీఆర్ రెండో చోట్లా పోటీ ఎందుకు..? కామారెడ్డి నుంచి పోటీ వెనుక మాస్టర్ ప్లాన్..!

గజ్వేల్ నుంచి మాత్రమే కాకుండా.. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం సంచలనం కలిగిస్తోంది. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలున్నాయి. నిజానికి కేసీఆర్‌కు గజ్వేల్‌లో అంతగా పరిస్థితులు అనుకూలంగా లేవనేది పలు సర్వేల ద్వారా తేలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2023 | 04:41 PMLast Updated on: Aug 21, 2023 | 4:41 PM

Telangana Cm Kcr Is Contesting From Kamareddy And Gajwel Here Is The Reason

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థులకు అందకుండా ఉంటాయి. ఆయన వ్యూహాల్ని అంచనావేయడం అసాధ్యం. ప్రత్యేక వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి.. రెండు చోట్లా పోటీ చేయబోతున్నారు. దీని వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉందని అర్థమవుతోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, గజ్వేల్ నుంచి మాత్రమే కాకుండా.. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం సంచలనం కలిగిస్తోంది. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలున్నాయి. నిజానికి కేసీఆర్‌కు గజ్వేల్‌లో అంతగా పరిస్థితులు అనుకూలంగా లేవనేది పలు సర్వేల ద్వారా తేలింది. కేసీఆర్ అంతర్గత సర్వేల ద్వారా ఆయనకు ఈ విషయం స్పష‌్టమైంది. అలాగని గెలుపు అవకాశాలు లేవని చెప్పలేం. కానీ, పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడిపోతే.. అది ఆయనకు, పార్టీకి చెడ్డపేరు తెస్తుంది. దీనిలో భాగంగానే గజ్వేల్ కాకుండా మరో నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. అలా కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కామారెడ్డిని ఎంచుకోవడం వెనుకమాత్రం అనేక వ్యూహాలున్నాయి.
ఒక్క దెబ్బకు రెండుపిట్టలు
కామారెడ్డిలో ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈసారి ఆయనను తప్పించి అక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారు. కామారెడ్డిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. కూతురు కవిత. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి, ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అది కవిత రాజకీయ భవిష్యత్‌కు మాయనిమచ్చగా మిగిలింది. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో కవిత మళ్లీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అందుకే అటు కవితకు హెల్ప్ అవ్వడంతోపాటు, నిజామాబాద్ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారు. కామారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందింది. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ.. దక్షిణ తెలంగాణలో పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. అదే ఇక్కడి కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. బీఆర్ఎస్‌పై ప్రజల్లో సానుకూలత పెరుగుతుంది.

కామారెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ హవా మొదలవుతుంది. దీనివల్ల నిజామాబాద్‌లో కూడా పార్టీపై ఉన్న వ్యతిరేకత తగ్గి.. కవిత గెలుపు అవకాశాలు పెరుగుతాయి. దీంతోపాటు తమ పార్టీపై విరుచుకుపడుతున్న ధర్మపురి అరవింద్‌కు చెక్ పెట్టే అవకాశం కూడా దొరుకుతుంది. అలాగే కామారెడ్డిలో బలపడుతున్న కాంగ్రెస్‌‌ను ఎదుర్కోవచ్చు. కేసీఆర్ పోటీ చేయడం వల్ల అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. రెండింటికీ ఒకేసారి చెక్ పెట్టినట్లవుతుందని నమ్ముతున్నారు. అంతేకాదు.. నిజామాబాద్‌కు పొరుగునే ఉన్న మహారాష్ట్ర ఎన్నికలపై కూడా కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభావం ఉంటుంది. తెలంగాణ తర్వాత కేసీఆర్ ఫోకస్ చేసింది మహారాష్ట్రపైనే. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తెలుగువాళ్లు ఎక్కువ. అందుకే కేసీఆర్ కామారెడ్డి నుంచి, కూతురు కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయడం వల్ల మహారాష్ట్రలోనూ పార్టీకి కలిసొస్తుందని అంచనా. ఒకవేళ కేసీఆర్ రెండో చోట్ల నుంచి గెలిస్తే.. కవిత కోసం కామారెడ్డికే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. మరోవైపు గజ్వేల్‌లో పరిస్తితులు అనుకూలించకపోవడం వల్ల ఓడిపోయినా.. కామారెడ్డిలో గెలుపు ఊరటనిస్తుంది. ఇలా అన్ని రకాలుగా అంచనావేసి కేసీఆర్.. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.