Telangana: బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ..కేసీఆర్‌కు భయం స్టార్ట్ అయిందా ?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ ఏడాది చివరినాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ కసితో కనిపిస్తుంటే.. ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయ్. దీంతో తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ఓ వైపు లిక్కర్ కేసు, మరోవైపు పేపర్ లీకేజీ.. ఇలాంటి పరిణామాల మధ్య బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. ఆత్మీయ సందేశం పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. ఉద్యమస్థాయి నుంచి పార్టీ ఎదిగిన తీరును గుర్తు చేశారు. కష్టాలు, కన్నీళ్లు, కరవుతో అల్లాడిన తెలంగాణ.. ఇవాళ పచ్చని పంటలతో చిరునవ్వుతో కళకళలాడుతోందని తెలిపారు. వలస పార్టీల పాలనలో ఆగమైపోయిన తెలంగాణ ఇప్పుడు కుదుటపడిందని.. కడుపు నిండా తిని.. కంటినిండా నిద్రపోతోందని వివరించారు.
రాష్ట్రం బాగుంటే సరిపోదని.. దేశం కూడా బాగుపడాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీకి తెలివి లేదని.. విజన్, సంకల్పం అసలే లేవని లేఖలో ఫైర్ అయ్యారు. ఇది ఎన్నికల సంవత్సరం అని.. ప్రతీ నాయకుడు, కార్యకర్త జనాల్లో ఉండాలని కేసీఆర్ సూచించారు. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాసిన లేఖ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నా.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో.. మళ్లీ కారు పార్టీదే విజయం అని అంతా అనుకున్నారు. ఐతే సీన్ ఒక్కసారిగా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. కవిత లిక్కర్ కేసుతో పాటు.. పేపర్ లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్‌ను ఇరుకునపెడుతోంది. దీనికితోడు పార్టీలో గ్రూప్ తగాదాలు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కొత్త టెన్షన్‌గా మారింది. ఈ పరిణామాలతో కేసీఆర్‌కు టెన్షన్ పట్టుకుందని.. నేనున్నా అంటూ పార్టీ శ్రేణులను ఈ లేఖ రూపంలో కేసీఆర్ పలకరించారనే చర్చ జరుగుతోంది.