ఢిల్లీలో రేవంత్ ఏం చేస్తున్నట్టు…? కేంద్ర మంత్రుల ఇళ్ళ చుట్టూనే రేవంత్
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదటి (నిన్న) రోజు ముగ్గురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి... పలు విజ్ఞప్తులను వారి ముందు ఉంచారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదటి (నిన్న) రోజు ముగ్గురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి… పలు విజ్ఞప్తులను వారి ముందు ఉంచారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సందర్భంగా రీజినల్ రింగ్ రోడ్డు మొత్తానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపండి అంటూ కిషన్ రెడ్డిని కోరారు రేవంత్.
రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ – 2 మూసి రివర్ ఫ్రంట్ లకు నిధులు ఇప్పించాలని కిషన్ రెడ్డిని కోరారు. మూసి గోదావరి లింక్ హైదరాబాద్ శివరేజి మాస్టర్ ప్లాన్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ చేయూత ఇవ్వండని విజ్ఞప్తి చేసారు. సింగరేణి కి కోల్ బ్లాక్ గనులను కేటాయించాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానును కలిసి కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.
కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరిని కలిసి రీజినల్ రింగ్ రోడ్డు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయమని కోరినట్టు తెలుస్తోంది. హైదరాబాద్- విజయవాడ ఆరు వరుసల విస్తరణ డీపీఆర్ ఆమోదించమని కోరారట. తెలంగాణ -చతిస్గడ్ ను అనుసంధానించే ఎన్ హెచ్ 63 (16) వరంగల్ హనుమకొండ నగరాల మధ్యగా వెళుతుందని ఈ రహదారిని నగరం వెలుపల నుంచి నాలుగు చోట్ల కలుపుతూ బైపాస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసారు.
పర్వత్ మాల ప్రాజెక్టులో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి మరి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరకాలం పాలన… ఇచ్చిన హామీలు అమలుపట్ల ప్రజల స్పందన వంటి అంశాలపై అధిష్టానం పెద్దలను కలిసి చర్చించే అవకాశం ఉంది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ పై ఈరోజు అధిష్టానం పెద్దలతో చర్చించి క్లారిటీ తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గ విస్తరణ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ ఆశావాహులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఎవరికివారు తమకే ఈసారి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందంటు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆశావాహులు. ఇప్పటికే ఢిల్లీలో మకామేసి అధిష్టానం పెద్దలను సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.