Telangana Congress: తెలంగాణలో పదవులు పందేరం.. కేబినెట్, నామినేటెడ్ పోస్టులకు వెయిటింగ్ !
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. దీంతో నాయకులంతా ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉన్నందున వెంటనే కొన్ని పదవులను అయినా భర్తీ చేయాలన్న ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలిసింది.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులంతా పదవుల కోసం ఆవురావురుమంటున్నారు. కేబినెట్ విస్తరణ జరిగితే మంత్రి పదవుల కోసం కొందరు, కార్పొరేషన్ ఛైర్మన్‌గిరీల రూపంలో నామినేటెడ్ పోస్ట్‌ల కోసం మరికొందరు.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు సీరియస్‌గా ఉన్నారు. అధిష్టానం దగ్గర పలుకుబడి ఉండే అగ్రనేతలు ఆ రూట్లో, సీఎం దగ్గర పలుకుబడి ఉన్న నాయకులు ఆయన సన్నిహితుల ద్వారా పైరవీలు చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఇంతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. దీంతో నాయకులంతా ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉన్నందున వెంటనే కొన్ని పదవులను అయినా భర్తీ చేయాలన్న ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలిసింది.
PAWAN KALYAN: పవన్ పోటీ చేసే స్థానం ఫిక్స్.. భీమవరం నుంచే జనసేనాని
దాదాపు 10 నుంచి 15 కార్పొరేషన్స్‌కు ఛైర్మన్స్‌ని ఇప్పుడు నియమించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు ఆమోదముద్ర వేయించుకునే పనిలోనే అగ్రనాయకులు ఢిల్లీకి వెళ్లినట్టు చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. 25 నుంచి 30 కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్ని భర్తీ చేయాలన్న ఆలోచన ఉన్నా.. అది ఇప్పటికిప్పుడు సాధ్యమా అన్న చర్చ కూడా ఉంది పార్టీలో. పార్లమెంటు ఎన్నికల తర్వాతే.. పూర్తిస్థాయిలో పదవులు ఇస్తారన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం సీరియస్‌గా ప్రయత్నించి భంగపడ్డ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పదవులు ఇచ్చి సంతృప్తి పరచాలని చూస్తోందట అధినాయకత్వం. మిగిలిన వారికి పార్లమెంట్ ఎన్నికల తరువాత ఇస్తారన్న చర్చ నడుస్తోంది. పదవులు ఆశిస్తున్న అందర్నీ ఒకే గాటన కట్టడం కంటే.. అసెంబ్లీ టికెట్లు రాని వారిని ఫస్ట్ లిస్ట్‌లో క్లియర్ చేస్తే మంచిదన్న అభిప్రాయమే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. క్యాబినెట్ విస్తరణ మీద కూడా చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి.
ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రస్తుతం క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆయా జిల్లా నేతలు ఆశలు పెంచుకున్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మార్పులు.. చేర్పులు ఉంటాయని ఆశతో ఎదురు చూడటం పరిపాటి అయింది. నిజామాబాద్‌కు చెందిన ఓ నేత మంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దల నుంచి ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో నాయకుడు కూడా అదే పనిలో ఉన్నారట. ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో పదవులు ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీకి వెళ్లిన నేతల వైపు ఆశగా చూస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా తర్వాత పదవులు ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి ప్రస్తుతానికి పదవులు ఇచ్చి మిగిలిన వారికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇద్దామనుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది.