CM KCR: మైనారిటీలకు రూ.లక్ష సాయం.. ఎన్నికల వేళ వరాలు ప్రకటిస్తున్న కేసీఆర్
మైనారిటీలకు కూడా ఆర్థిక సాయం అందించబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అర్హులకు రూ.లక్ష సాయాన్ని అందించాలని అదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలతో అధికారిక ఉత్తర్వులు ఆదివారం వెలువడ్డాయి.
CM KCR: దళిత బంధు ద్వారా ఎస్సీలను ఆకట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత బీసీలకు ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మైనారిటీలకు కూడా ఆర్థిక సాయం అందించబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అర్హులకు రూ.లక్ష సాయాన్ని అందించాలని అదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలతో అధికారిక ఉత్తర్వులు ఆదివారం వెలువడ్డాయి. దీని ప్రకారం ఎంపికైన లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందుతుంది. బ్యాంకులతో లింకేజీ లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఈ సాయం అందజేస్తారు. ఈ డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సాయం అందిస్తారు. చేతి వృత్తులు చేస్తున్న మైనార్టీలు తమ వృత్తులకు సంబంధించి పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారాల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సాయం అందిస్తారు. 21 ఏళ్లు పూర్తై, 55 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మానిటరింగ్, స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ముస్లిం మైనారిటీలతోపాటు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీ వర్గాలు కూడా ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేలు చెక్కులు అందిస్తారు.
ఓట్లను ఆకర్షించే మంత్రం
ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం కేసీఆర్ ఓటర్లకు వరాలు ప్రకటిస్తున్నారు. దళిత బంధును మరింత ఎక్కువ మందికి ఇచ్చినట్లు ప్రకటించగా, బీసీలను ఆకట్టుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పుడు మైనారిటీలను ఆకట్టుకునేందుకు వారికి కూడా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పేరుకు ఆర్థిక సాయం అని చెప్పుకొంటున్నా.. లబ్ధిదారుల సంఖ్య, వందలు, వేలల్లోనే ఉంటుంది. దరఖాస్తుల లక్షల్లో వస్తుంటే అందులో పది శాతం మందికి కూడా సాయం అందడం లేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ఇలా సాయం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితం ఉండటం లేదు. ఎందుకంటే లబ్ధిదారులకంటే పథకం రాని వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.
దీంతో వాళ్లందరిలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకు ఆర్థిక సాయం చేస్తున్నామని, దేశంలోనే తమలాగా ఎవరూ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని మాత్రం గొప్పగా చెప్పుకుంటోంది. ఎన్నికలొస్తున్నాయంటే.. ఇలా ఉచిత పథకాలు ప్రకటించడం, కొందరికి లబ్ధి కలిగేలా చేయడం ఈమధ్య ట్రెండ్ అయిపోయింది. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలాగే ఎన్నికలకు ముందు సాయం అందించినా.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఓడిపోయింది. మరి తెలంగాణలో ఈ పథకాలు కేసీఆర్‌కు ఏమాత్రం ఓట్లు కురిపిస్తాయో రాబోయే ఎన్నికల్లో తేలుంది.