Vanama Venkateswara Rao: వనమా ఖేల్ ఖతం.. జలగంకు లైన్ క్లియర్..!
కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వనమా ఎమ్మెల్యే సభ్యత్వం రద్దైనట్లే. అదే కోర్టు ఆదేశం ప్రకారం.. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో అధికార బీఆర్ఎస్, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Vanama Venkateswara Rao: కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ అంతకుముందు ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేసేందుకు నిరాకరించింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వనమా ఎమ్మెల్యే సభ్యత్వం రద్దైనట్లే. అదే కోర్టు ఆదేశం ప్రకారం.. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో అధికార బీఆర్ఎస్, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన వనమా.. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించాడంటూ, ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మూడేళ్లు విచారణ జరిపిన కోర్టు వనమా తప్పు చేసినట్లు గుర్తించి, ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆయన తర్వాతి స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వనమా తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. తాను ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయదలచుకున్నానని, అప్పటివరకు తన సభ్యత్వంపై ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా చూడాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వనమా పిటిషన్‌ను కొట్టేసింది.
తమ తీర్పు అమలును నిలిపివేసేందుకు నిరాకరించింది. దీని ప్రకారం.. వనమా ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన జలగంను ఎమ్మెల్యేగా నియమించాలి. ఈ తీర్పుపై జలగం ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ను సంప్రదించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని, ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. వనమా సభ్యత్వం రద్దైన నేపథ్యంలో ఆయన రాజీనామా కూడా చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వనమా కాంగ్రెస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్‌లో చేరారు. జలగం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జలగం ఎన్నికయ్యేది కూడా బీఆర్ఎస్ నుంచే ఇద్దరూ తమ పార్టీకే చెందినప్పటికీ, ఎన్నికల వేళ ఒకరి స్థానంలో మరొకరిని నియమించడం కచ్చితంగా పార్టీకి ఇబ్బందికర పరిణామమే.
మరి ఈ విషయంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఒకవేళ జలగం ఎమ్మెల్యేగా పదవి చేపట్టినప్పటికీ ఆయన గరిష్టంగా నాలుగు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఆలోపు ప్రభుత్వాన్ని కేసీఆర్ రద్దు చేస్తే.. అంతకంటే తక్కువ కాలమే ఎమ్మెల్యేగా ఉండాల్సి వస్తుంది. అతి తక్కువ కాలం ఎమ్మెల్యే పదవిలో కొనసాగిన నేతగా జలగం నిలుస్తారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేది.. లేనిది.. త్వరలోనే తేలుతుంది.