Harish Rao: మీది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్.. రాహుల్‌కు హరీష్ రావు కౌంటర్..
ఖమ్మం జనగర్జన సభలో బీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి రాహుల్ చేసిన కామెంట్స్‌కు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao Counter To Congress
కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించిట్టు ఉంటుందన్నారు. కాంగ్రెస్ చేసినన్న కుంభకోణాలు ఏ పార్టీ చేసి ఉండదని.. అందుకే ప్రజలు అధికారం నుంచి దూరం చేశారని చెప్పారు. మీది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయాడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం బడ్జెట్ 80 వేల కోట్లైతే లక్ష కోట్ల అవినీతి జరిగింది అనడం నిజంగా హాస్యాస్పదమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం కాంగ్రెస్ నేతల కళ్లకు కనిపించడంలేదా అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసిన తరువాత కాంగ్రెస్ వాళ్లు కొత్తగా ఇచ్చేది ఏంటంటూ ఎద్దేవా చేశారు. చూయూత పేరుతో ఇప్పుడు ఫించన్లు ప్రకటించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఒకప్పుడు భూములు అడిగితే జైల్లో పెట్టినోల్లు ఇప్పుడు భూములు పంచుతామని అని చెప్పడం హస్యాస్పదమన్నారు. కరెంట్ అడితే కాల్చినోల్లు ఉచిత కరెంట్ గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఖమ్మం సభ కేవలం బీఆర్‌ఎస్ మీద ఆరోపణలు చేయడానికే పెట్టారని అన్నారు. కాంగ్రెస్ వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా బీఆర్‌ఎస్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. సభా వేదిక మీద కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్టు కనిపించిందంటూ సెటైర్ వేశారు. ఖమ్మం సభ పెద్ద ఫెయిల్యూర్ అని పస లేని ప్రసంగాలు నిజాలు లేని ఆరోపణలు అంటూ కౌంటర్ ఇచ్చారు.