Malla Reddy: ఐటీ వాళ్లు నా డబ్బుల గది చూడలే.. మళ్లీ నోరు జారిన మల్లన్న!
మంత్రి మల్లారెడ్డికి జోష్ వస్తే.. కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి మల్లారెడ్డి మళ్లీ నోరు జారారు. ఎన్నికల కోసమే ఆర్టీసీ విలీనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి నాలుక్కరుచుకున్న మంత్రి మల్లారెడ్డి.

Telangana minister Mallareddy made sensational comments on IT department and Congress party
మేడ్చల్‌లో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగాలో తానే డిసైడ్ చేస్తానని మరో రచ్చ రేపారు. దీని మీద చర్చ జరుగుతుండగానే.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయ్. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. గతంలో మల్లారెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మాట్లాడిన మల్లారెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో డబ్బులున్న గదిని ఐటీ అధికారులు అసలు చూడనే లేదని.. ఆ డబ్బులే ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది తానేనని.. గత ఎన్నికల్లో కేఎల్ఆర్‌కు టికెట్ ఇప్పించింది తానే అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చరేపుతుండగానే ఇప్పుడు ఐటీ గురించి ఆయన ఇలా మాట్లాడడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ గొడవలు తామే సృష్టించామని.. కాంగ్రెస్ అధిష్టానంలో తనకు దోస్తులు ఉన్నారని మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఐటీ అధికారుల గురించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో మరి.