Khammam: ఖమ్మంపై కన్నేసిన పార్టీలు.. భారీ సభలకు ప్లాన్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్.. అమిత్ షా, రాహుల్ రాక!

ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభలకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 09:53 AMLast Updated on: Jun 07, 2023 | 9:53 AM

Telangana Parties Including Bjp And Congress Are Focusing On Khammam

Khammam: తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి పార్టీలు. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభలకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 15న జరగనున్న ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు.

ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 20 లేదా 25 తేదీల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ సభ జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతోపాటు కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారు. కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పొంగులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఆయన విధించిన డిమాండ్లలో ఇది కూడా ఒకటనే ప్రచారం ఉంది.

పైగా ప్రియాంకా గాంధీని గెలిపించుకునే బాధ్యత తానే తీసుకుంటానని పొంగులేటి అధిష్టానానికి హామీ ఇచ్చారట. దీనికి అధిష్టానం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి అన్నీ అనుకూలిస్తే ప్రియాంకా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయొచ్చు. ఇది ఆ పార్టీకి లాభించే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ సెటిలర్లు, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్లు అధికంగా ఉండటంతో వాళ్ల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.

దీనిలో భాగంగా మహానటుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ విగ్రహం విషయంలో వివాదం రేగడంతో విగ్రహ ఏర్పాటు వాయిదా పడింది. మరోవైపు ఖమ్మంలో కమ్యూనిస్టులకు కూడా మంచి పట్టు ఉంది. కమ్యూనిస్టులు కూడా ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు సీట్లైనా దక్కించుకుని, ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేయాలని భావిస్తోంది. ఇలా అన్ని పార్టీలూ ఖమ్మం జిల్లాపైనే ప్రధానంగా దృష్టిపెట్టాయి.