Telangana: బూటకపు హామీలు వర్సెస్ అబద్ధాల చిట్టా.. ప్రజలు దేన్ని నమ్ముతారు..?
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలలో అమలుకాని అంశాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి రథయాత్రలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది బీజేపీ.
Telangana: ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్ దాకా.. ప్రతీచోటా.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని ఈ పార్టీలు వాడుకుంటున్నాయి.
బీజేపీ రథయాత్రలు
ఇందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి రథయాత్రలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది బీజేపీ. అలంపూర్ (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా), భద్రాచలం (ఉమ్మడి ఖమ్మం జిల్లా), బాసర (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా) నుంచి రథయాత్రలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో కేంద్రం నుంచి ప్రారంభం అయ్యే రథయాత్ర ప్రతిరోజూ కనీసం 3 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుందని అంటున్నారు. సెప్టెంబర్ 17 నుంచి ఈ రథయాత్రలు ప్రారంభించాలా లేదా ఆ రోజు రథయాత్ర ముగిసేలా చేపట్టాలా అనే దానిపై ఇంకొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రథయాత్రలు 15-20 రోజులపాటు కొనసాగి హైదరాబాద్‌లో ముగిసేలా రూట్‌మ్యాప్ ఉంటుందని అంటున్నారు. ఈ రథయాత్రల్లో భాగంగా దళిత బంధు, బీసీ బంధు, నిరుద్యోగ సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలులో కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేలా ఆందోళన కార్యక్రమాలను రూపొందించనున్నారు. తద్వారా ప్రజలను ఆలోచింపజేసి, తమవైపునకు తిప్పుకోవచ్చని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
రేవంత్ సేన రెడీ..
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలలో అమలుకాని అంశాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు దాన్ని అమలు చేయకపోగా.. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఓట్ల కోసం మళ్లీ అదే హామీని బీఆర్ఎస్ తెరపైకి తెస్తుండటాన్ని తిప్పికొట్టాలని హస్తం పార్టీ లీడర్లు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ ఆలస్యం కావడం వల్ల.. ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షను వడ్డీలకే రైతులు కట్టాల్సి వస్తోందని రేవంత్ సేన అంటోంది. రూ.లక్ష రుణమాఫీని వడ్డీతో సహా చెల్లించాలనే డిమాండ్‌తో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దళిత బంధుతో పాటు బీసీ బంధును పూర్తిగా అమలు చేయాలని ఆయా వర్గాలతో కలిసి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది.
100 అబద్ధాలు
హామీల అమలు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమను టార్గెట్ చేస్తుండటంతో.. వాటికి బలమైన కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ కూడా పదునైన అస్త్రాలను రెడీ చేస్తోంది. ఈక్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకు “100 అబద్ధాలు” పేరుతో ఓ బుక్‌లెట్‌ను, సీడీని ఇటీవల రిలీజ్ చేసింది. తెలంగాణకు, దేశానికి చేసిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ఎలా విఫలమైందో ప్రజలకు వివరించేలా వీటిలో సమాచారాన్ని పొందుపరిచింది. ఇది శాంపిల్ మాత్రమేనని.. కేంద్రం అబద్ధాలపై మున్ముందు విభిన్న రూపాల్లో మరింత సమాచారాన్ని రిలీజ్ చేస్తామని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అన్నారు. ఉద్యోగాల భర్తీ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు, తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం వంటి వాటిపై తెలంగాణ ప్రజలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు అబద్ధాల చిట్టా.. మరోవైపు హామీల అములో వైఫల్యాల చిట్టా.. ఈ రెండింటిలో ఎటువైపు ప్రజలు మొగ్గు చూపుతారో వేచిచూడాలి..!