Political war 2023: తెలంగాణలో వేసవి తాపాన్ని మించిపోతున్న రాజకీయ వేడి..?
తెలంగాణలో ఎన్నికల వేడి ఆరు నెలల ముందే రాజుకుందా.. మోడీ మాటలు.. ఈడీ కేసులు.. బీఆర్ఎస్ ఆరోపణలు.. కాంగ్రెస్ పాదయాత్రలు.. నాయకులు అసహనాలు.. పార్టీల్లో చేరికలు.. ప్రతిపక్షాల ఆరోపణలు.. అక్రమ అరెస్ట్లు.. ఇవన్నీ నిత్యం ఏదో ఒక సందర్భంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నేడో రేపో ఎన్నికల పోలింగ్ జరుగుతుందా అనేలా వాతావరణం మారిపోయింది. ఒకవైపు భానుడి భగభగలు తీవ్ర రూపం దాల్చుతుంటే.. రాజకీయ పార్టీల విమర్శలు ప్రతివిమర్శల పర్వం చకచకా సాగుతూ పోతోంది. పైగా మీడియా సమావేశాలకైతే కొదవేలేదు. ప్రతిఒక్కరూ ఏదో ఒక స్టాండును తీసుకొని ప్రత్యర్థులపైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి పరిస్థితులపై గతంలో ఎలా ఉండేది.. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పుడు చూసేద్దాం.
దేశప్రధాని మోదీ తెలంగాణలో ఇప్పటికే చాలా సార్లు సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలతో ఇక్కడి నాయకులకు జోష్ నింపుతున్నారు. అలాంటి తరుణంలో బండి సంజయ్ విడతలవారీగా పాదయాత్రను గత ఏడాతే ప్రారంభించి ప్రభుత్వ వ్యతిరేఖతను తూర్పారా పడుతున్నారు. దీనికి కౌంటర్గా అధికారపక్షం నాయకులు కూడా అంతే ఘాటుగా తిప్పికొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కొత్తగా సీబీఐ, ఈడీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అది కూడా కేవలం అధికార పార్టీ ప్రదాన నాయకులపై రావడం కాస్త చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉంటే మోడీకి, ఈడీకి జంకం అంటూ మంత్రులు మాటల దాడిని చేస్తూ తమ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు.
ఇక లిక్కర్ స్కాం వ్యవహారంలో అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. ఇందులో కొందరి పేర్లు ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. ఏక్షణంలోనైనా అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోడీ కన్నా ముందుగా ఈడీ వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో చాలా రాష్ట్రాలలో జరిగిన సోదాలే దీనికి ఉదాహరణగా పరిగణించవచ్చు. ఢిల్లీ మొదలు పశ్చిమ బెంగాల్ వరకూ అన్నీ రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కానీ వాటన్నింటినీ ఎదురోడ్డి పోరాడి ప్రజామద్దతు పోంది నేడు మళ్ళీ రాజ్యాధికారంలో కొనసాగుతున్నారు కొందరు నాయకులు. దీనివల్ల ఈడీని బీజేపీ ఒకపావుగా వాడుకుంటుందని కొందరి వాదన. ఇదే నిజమైంతే చాలా హేయమైన చర్యగా పరిగణించవలసి వస్తుంది.
ఇప్పటి వరకూ చెప్పుకున్నది ఒక ఎత్తైతే.. ఇప్పుడు తెలుసుకోబోయే అంశాలు మరింత కీలకం. అవే పార్టీ ఫిరాయింపులు. కొందరు అధికారపార్టీలో అసహనానికి గురై కాంగ్రెస్, బీజేపీల వైపుకు మొగ్గుచూపుతున్నారు. అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కొందరు ఈ ఇరుపార్టీ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. అలాగే పాదయాత్రల పర్వం కూడా జోరుగా సాగుతోంది. వీటిని అడ్డుకునేలా ఏర్పాట్లు అప్పుడప్పుడూ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి బండి సంజయ్, వైఎస్ షర్మిలను ఉదాహరణగా తీసుకోవాలి. ఇదంతా ఒక రాష్ట్రంలో జరిగే వ్యవహారం మాత్రమే.
ఇక పొరుగురాష్ట్రాలకెళ్తే అధికారంలో ఉన్న ప్రాంతీయపార్టీలకు చుక్కెదురు తప్పడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీటింగ్ కు ముందుగా అనుమతి ఇచ్చారు అక్కడి అధికారులు. తీరా ప్రసంగించేందుకు సిద్దమైన సమయంలో అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు లోకల్ పాలనా యంత్రాంగం అడ్డుకుంటే.. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయపార్టీలకు కేంద్రం అడ్డుతగులుతోంది. ఇలా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు, పాలకుల వ్యతిరేఖతను చూపించేందుకు ఆయాపార్టీలు పెద్ద ఎత్తులో యాగి చేస్తూ మీడియా సమావేశాలు పెడుతున్నాయి. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటే మరికొన్ని అపజయం మూటకట్టుకుంటుంది.
కేంద్రం వైఖరిపై తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది ఇక్కడి అధికారపార్టీ. గ్యాస్ బండ ధర పెంపు, పెట్రోల్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. అలాగే మోదీ కార్పోరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్నాడంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని మీడియా ఛానళ్లపై కూడా తమదైన శైలిలో హెచ్చరించారు. ఇప్పటి రాజకీయాల్లో ప్రతిపార్టీకి ఒక మీడియా ఛానల్ ఉండటం పరిపాటిగా మారిపోయింది. అలాంటి తరుణంలో మాజీ ఎంపీ వివేక్ కి సంబంధించిన వెలుగు6 అనే మాధ్యమాన్ని ప్రత్యేకంగా ఉచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని అమాంతం పెంచేశాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇతను బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. దశాబ్దాల కాలం నుంచి మీడియాని అవసరమైనంత ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి మీడియానే విమర్శించడం రాజకీయనాయకులకు అలవాటుగా మారింది. గతంలో టీవీ9, భారత్ టుడే న్యూస్ ఛానళ్లను బ్యాన్ చేయాలని కొద్దిరోజులపాటూ ప్రసారాన్ని నిలిపివేసింది. కొన్ని పరిస్థితుల దృష్ట్యా నెలల వ్యవధిలో తిరిగి ప్రారంభమైయ్యాయి.
ఇంతలా ప్రతి ఆరోపణలు చేసుకుంటూ చివరకు మీడియాను పేరును ఉచ్ఛరించేలా రాజకీయ రణరంగం మొదలైందని చెప్పక తప్పడంలేదు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ రాజకీయంగా గట్టిపోటీ బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ అని పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ప్రజలు చివరగా ఎవరికి పట్టంకడతారన్నది ఇక్కడ ప్రదానం. భవిష్యత్తులో అధికారం ఎవరిదో తెలియాలంటే అక్టోబర్ – నవంబర్ వరకూ వేచిచూడాలి.
T.V.SRIKAR