Telangana: కవిత ఎపిసోడ్‌లో సానుభూతి మిస్సింగ్.. కేసీఆర్‌ను వెంటాడుతోన్న టెన్షన్ ఏంటి ?
అండ ఉంటే కొండ కడిగినట్లే అని ఓ సామెత ఉంది. అదే అండ ఇప్పుడు కవిత విషయంలో సీన్ రివర్స్ చేస్తుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత వ్యవహారంలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. మూడుసార్లు విచారణకు వెళ్లొచ్చారు. వెళ్లిన ప్రతీసారి ఆమెకు అండగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. ఢిల్లీకి క్యూ కట్టారు. ఇంత జరుగుతున్నా.. ఈ వ్యవహారంలో అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారయింది.
కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. ఈడీతో కావాలని దాడులు చేయిస్తోందని.. తెలంగాణ ఆడబిడ్డను ఇబ్బందులు పెడుతున్నారనే నినాదంతో.. జనాల్లో సానుభూతి తీసుకువద్దామంటే.. అది వర్కౌట్ కావడం లేదు. నిజానికి ఏ రాజకీయ నాయకుడిపై విచారణ జరిగినా.. అదంతా తమ ఇమేజ్ దెబ్బ తీసే కుట్ర అని.. కావాలని తప్పుడు కేసుల్లో ఇరికించారని.. తాము ఆణిముత్యాలమని, స్వాతిముత్యాలమని చెప్పుకుంటారు.
ఈడీ విచారణకు ముందు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి కవిత చెప్పింది కూడా అదే ! ఐతే ఇవేనీ సింపతీ క్రియేట్ చేయలేకపోయాయ్. కేసీఆర్‌ను నిజంగా రాజకీయంగా దెబ్బతీయాలంటే.. కేటీఆర్‌నో, హరీశ్‌నో, సంతోష్‌నో టార్గెట్ చేసుకుంటారు తప్ప.. కవితపై ఎందుకు కేసులు వేస్తారనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు జనం. అందుకే బీఆర్ఎస్ ఎన్ని నినాదాలు చేస్తున్నా.. పెద్దగా రియాక్ట్ కాకుండా ఉంది కూడా అందుకే ! సానుభూతి రాకపోవడానికి మరో ప్రధాన కారణం.. కవిత వ్యవహారశైలే ! విచారణ అంటే భయం లేదని.. తెలంగాణ తలవంచదని బీరాలు పలికిన కవిత.. ఆ తర్వాత కోర్టును ఆశ్రచింయడం ఈడీ విచారణకు హాజరు కాకపోవడంలాంటివి జనాల్లో నెగిటివ్‌గా మారాయ్.
ఏ అవినీతి చేయకపోతే విచారణకు ఎందుకు భయపడ్డారు.. కవితే కాదు.. పొరుగు రాష్ట్రంలో అధికారపార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడిని కూడా విచారణకు పిలుస్తున్నారు కదా అనే ప్రశ్న నేచురల్‌గానే జనాల్లో మొదలైంది. అందుకే చేతులెత్తి ఫోన్లు చూపించినా.. విచారణకు ముందు భర్తతో కలిసి ఎమోషన్ పండించినా.. జనాల్లో జాలి కలగలేదు సరికదా.. మరింత భిన్నమైన వాతావరణం కనిపించింది. కవితను ఈడీ అరెస్ట్ చేస్తే సీన్ ఇంకోలా ఉండేదేమో కానీ.. అరెస్ట్ కూడా ఇప్పట్లో కష్టం అన్నట్లుగా కనిపిస్తోంది. గులాబీ పార్టీ ఇప్పుడేం చేసినా బూమరాంగ్ అవుతోంది. కవిత విచారణలోనూ అదే జరిగింది. సింపథీ రాకపోగా.. పార్టీ మీద, ఫ్యామిలీ మీద మరింత వ్యతిరేక ఎదురవుతున్న పరిస్థితి.
దీంతో ఎందుకు ఇలా జరుగుతోందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఒక్కటి మాత్రం నిజం.. అమాయకుల్ని అదే పనిగా వెంటాడుతూ.. వేధింపులకు గురిచేస్తున్న భావన జనాల్లో రావాలే తప్ప.. కవితకు అండ అంటూ బ్యాచ్‌లకు బ్యాచ్ ఢిల్లీకి వెళ్లడం.. అధికారాన్ని ప్రదర్శించడంలాంటి నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయ్. ఇప్పుడు కవిత విషయంలో జరిగింది అదే ! దీంతో ఈ పరిణామాలు ఇప్పుడు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పార్టీ మీద జనాల్లో వ్యతిరేకత మొదలైంది. లిక్కర్ స్కాం, పేపర్ లీకేజీ మరింత వ్యతిరేకత పెంచాయ్. ఇలాంటి సమయంలో కవిత ఎపిసోడ్‌తో సానుభూతి మంత్రం పటిస్తూ.. వచ్చే ఎన్నికల కోసం జనాల్లోకి వెళ్దామనుకుంటే.. సీన్ అంతా రివర్స్ అయింది. దీంతో కేసీఆర్ మరో వ్యూహానికి పదును పెడుతున్నారనే చర్చ జరుగుతోంది.