Politics: కాంగ్రెస్‌లోకా.. బీజేపీలో చేరుతారా.. ఆటా.. ఇటా.. ఎటు? పొంగులేటి లెక్కలే వేరయా ?

దారులు మూసుకుపోవడాలు ఉండవ్.. సరిగ్గా గుర్తించాలే కానీ ఎండ్‌ పడిన చోట.. కొత్త దారి కనిపిస్తుంది. ఇదే మాటను పదేపదే అనుకుంటోందిప్పుడు తెలంగాణ రాజకీయం ! రాష్ట్రం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిన వేళ.. బీఆర్ఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీద సస్పెన్షన్ వేటు విధించింది. నమ్మకాన్ని దెబ్బతీశారని ఒకరంటే.. తమ సత్తా ఏంటో చూపిస్తారమని ఇంకొంకరు.. కారు పార్టీకి సవాల్ విసిరారు. ఇద్దరు ఏమైనా మాములు నేతలా అంటే.. కానే కాదు ! రాజకీయాన్ని మలుపు తిప్పే నేతలు.. ఓటింగ్‌ను ప్రభావితం చేసే నాయకులు. దీంతో తెలంగాణ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 01:14 PMLast Updated on: Apr 13, 2023 | 1:14 PM

Telangana Politics Around With Ponguleti

జూపల్లి సంగతి ఎలా ఉన్నా.. పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అంటే పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్ ! పది అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిచయం ఉన్న నేత.. పరపతి ఉన్న నేత! ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి.. ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత కారు పార్టీలో చేరారు ఆయన ! ఏం జరిగిందో ఏంటో కానీ.. గులాబీ పార్టీలో అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు ఆయనకి ! అలిగిన ప్రతీసారి.. రాజకీయాల మధ్య నలిగిన ప్రతీసారి.. బీఆర్ఎస్‌ నుంచి ఎవరో ఒకరు పెద్దలు ఓదార్చినా.. అది కూడా కనిపించలేదు ఈ మధ్య! దీంతో ఆయన దారి ఆయన వెతుక్కుంటున్నారన్న ప్రచారం జరిగింది.

బీజేపీలో చేరుతారని ఒకసారి.. లేదు కొత్త పార్టీ పెడతారని మరోసారి.. ఇలా రకరకాల ప్రచారాల మధ్య.. పొంగులేటి మీద సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది కారు పార్టీ అధిష్టానం. జరగాల్సింది జరిగిపోయింది.. ఇకపై ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు ! ఆర్థికంగా, రాజకీయంగా రాజకీయాలను ప్రభావితం చేస్తే స్టామినా ఉన్న తెలంగాణ నేతల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చారు. ఒకరకంగా దారి మూసుకుపోయింది. మరి ఎండ్‌ పడిన చోట.. ఏ మలుపు ఉంటుందని రాష్ట్రం అంతా మాట్లాడుకుంటోందిప్పుడు ! ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతోంది.

ఇక అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన లెక్కలు తాను వేసుకుంటున్నారు. వ్యాపారం, రాజకీయం ఆయనకు రెండు కళ్లలాంటివి. ఒకదానికి మరొకటి కావాలి. ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు అనే స్థాయి పొంగులేటిది! ఈ రెండింటికి ఎలాంటి దెబ్బ పడకుండా ఉండేలా.. తన పొలిటికల్ జర్నీ కంటిన్యూ చేయాలని పొంగులేటి ప్లాన్ చేస్తున్నారు. ఒకదానికి మరొకటి ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి ఆయన ప్లాన్ కూడా ఇదే ! అందుకే నెక్ట్స్ అడుగు ఎక్కడ అన్న దానిపై ఆచీతూచీ నిర్ణయం తీసుకుంటున్నారు. పొంగులేటి ముందు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఆప్షన్లు ఉన్నాయ్. కాంగ్రెస్‌లోకి వెళ్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పొంగులేటికి పూర్తి ఆధిపత్యం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో.. తన బలంతో అందరినీ గెలిపించుకోగలరు. అవసరం అయితే నియోజకవర్గానికి 30కోట్ల చొప్పున 300 కోట్లు ఖర్చు చేసి గెలిపించగలడు. ఇది కాంగ్రెస్‌ నేతలు కూడా తెలుసు ! అందుకే పొంగులేటి అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా.. పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు హస్తం పార్టీ నేతలు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉంది. సీట్లు పెద్దగా లేకపోయినా.. అన్ని పార్టీలతో కంపేర్‌ చేస్తే కాంగ్రెస్‌ బలమే పెద్దది ! పొంగులేటి చేరితే.. జిల్లాలో పార్టీ విజయం నల్లేరు మీద నడకే ! పొంగులేటి విజయానికి కూడా ఢోకా ఉండదు. ఐతే ఇక్కడే అసలు సమస్య ఉంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత.. ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకోసం గట్టిగా నిల్చుంటారన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే ! గత ఎన్నికల్లో ఇలానే కాంగ్రెస్ నుంచి గెలిచి.. హస్తానికి హ్యాండ్ ఇచ్చిన సంఘటన ఇంకా కళ్లముందే తిరుగుతోంది మరి !

కష్టపడి గెలిచి, గెలిపించుకున్న తర్వాత.. వాళ్లందరినీ కేసీఆర్ తనవైపు తిప్పుకుంటే.. పొంగులేటి కష్టం వృథా కావడం ఖాయం. ఎవరి మీద కోపంతో.. ఎవరి మీద పంతంతో అయితే బరిలో దిగాడో.. వాళ్లే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తాను అనుకున్న అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ సంగతి ఇలా ఉంటే.. పోనీ బీజేపీ వైపు వెళ్లిపోదామా అంటే ఆ పార్టీకి ఖమ్మంలో కేడర్‌ లేదు కనీసం ! లీడర్ల సంగతి సరేసరి.. చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు కూడా లేరు కమలం పార్టీకి ! ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీలో చేరి తాను బాధ్యతలు తీసుకుంటే.. భారం అంతా పొంగులేటి మీదే పడుతుంది.

ఖమ్మం జిల్లాలో బీజేపీని స్ట్రాంగ్ చేయడం అంటే మాములు విషయం కాదు. విత్తనం వేసి.. వేరు దశ నుంచి పెంచుతూ రావాలి. కేడర్ తయారు చేసుకోవాలి.. పోనీ ఇంత కష్టపడినా బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు కమలం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఐతే బీజేపీలో చేరడం ద్వారా.. ఉన్న ఒకే ఒక్కలాభం.. తన వ్యాపారాలు సేఫ్‌గా ఉండడం. కేంద్రంలో బీజేపీని ఇప్పటికిప్పుడు గద్దె దించే పార్టీ కనిపించడం లేదు. దీంతో కేంద్రం అండతో.. వ్యాపారపరంగా తాను ఎదగడానికి అవకాశం ఉంటుంది.

ఇలా కాంగ్రెస్‌లో చేరితే రాజకీయ బలం.. బీజేపీలో చేరితే ఆర్థికబలం.. మరి ఈ రెండు సమీకరణాలు పొంగులేటి ఎలా బేరీజు వేసుకుంటారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఆయన ఎటు.. అటా ఇటా అన్నది ఆసక్తికరంగా మారింది.