నువ్వు నన్ను తిట్టు… నేను నిన్ను తిడతా, తెలంగాణలో రేవంత్, కిషన్ కుమ్మక్కు రాజకీయం

తెలంగాణ పాలిటిక్స్ హఠాత్తుగా రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి మధ్యయుద్ధంగా మారిపోయాయి. రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ నేరుగా ఆరోపించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఆందోళన చేయడం కన్నా కేంద్రం నుంచి తెలంగాణకి నిధులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని , అందుకోసం ప్రధానిపై ఒత్తిడి చేయాలని, కొత్త ప్రాజెక్టులు నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు రేవంత్. దానికి ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు కిషన్ రెడ్డి. ఏ ప్రాజెక్టులు అడ్డుకున్నానో , ఏ నిధులు రాకుండా నిలువరించానో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
దీనికి ప్రతిగా రేవంత్ కిషన్ రెడ్డికి భారీ లేఖ రాశారు. కిషన్ రెడ్డి వల్లనే మెట్రో మూసి ప్రాజెక్ట్ ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రానికి ఎన్ని ఇల్లు ఇచ్చారో కూడా ప్రకటించాలని అడుగుతున్నారు రేవంత్. అధికారం కోల్పోతామని కులగలను అడ్డుపడుతున్నారని బిజెపిని రేవంత్ తిట్టిపోస్తున్నారు. అంతేకాదు తెలంగాణ చెల్లించే పనుల్లో పావలా కూడా తిరిగి రాష్ట్రానికి రావడం లేదని కొత్త పాయింట్ లేవనెత్తారు సీఎం.
కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాగ్వాదం చూసిన వాళ్లందరికీ ఎక్కడో చిన్న అనుమానం వస్తుంది. కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లకైనా తేలిగ్గా అర్థం అయిపోతుంది. అసలు టిఆర్ఎస్ ప్రస్తావనే లేకుండా వీళ్ళిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం… తద్వారా రాజకీయం మొత్తం ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం ద్వారా తెలంగాణ ఆక్టివ్ పాలిటిక్స్ లో టిఆర్ఎస్ పాత్రను వ్యూహాత్మకంగా తగ్గిస్తున్నారా అనే అనుమానం పుట్టిస్తున్నారు. నాకు ఏమీ చేయటం లేదంటూ, ఇవ్వాల్సి నిధులు కూడా ఇవ్వడం లేదని రేవంత్ పదేపదే విరుచుకుపడుతున్నారు. దానిని కిషన్ రెడ్డి కౌంటర్ చేస్తున్నారు. ఈ మాటలు యుద్ధంలో టిఆర్ఎస్ కి ఎక్కడ స్కోప్ దొరకటం లేదు. సహజంగానే బిజెపిని టచ్ చేయకుండా కేవలం కాంగ్రెస్ మీద విరుచుకు పడే బి ఆర్ ఎస్ నేతలు…. కిషన్ రేవంత్ సంవాదం చూసి ఆలోచనలో పడిపోతున్నారు.
మొత్తం మీద 2028లో బిజెపి, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని, ఇప్పటి నుంచి జనంలో ఒక అభిప్రాయం కలిగించడానికి…. ఒక అవగాహనతో కిషన్ రెడ్డి, రేవంత్ ఛాలెంజ్ లు విసురుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పరిస్థితి గమనించిన బి ఆర్ ఎస్ ఉనికి కోసం రకరకాల ఫీట్లు చేస్తుంది. ఏ ఇష్యూ ని వదిలి పెట్టకుండా ఒకపక్క హరీష్, మరో పక్క కేటీఆర్, ఇంకో పక్క కవిత నిస్సంకోచంగా విరుచుకు పడిపోతున్నారు. ఇప్పటికీ తెలంగాణ బ్రాండ్ అంబాస్విడర్లం మేమే అన్న కలరింగ్ ఇస్తున్నారు. రేవంత్, కిషన్ కుమ్మక్కు రాజకీయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.