Telangana Politics: కొత్త వద్దు.. పాతే ముద్దు.. గెలుపే వ్యూహంగా ప్లాన్ అమలు చేస్తున్న పార్టీలు

తెలంగాణలో ఈసారి కాస్త విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నలుగురు టికెట్లు ఆశిస్తుంటారు. వారిలో పాత వారుంటారు. కొత్త ముఖాలు ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2023 | 10:22 AMLast Updated on: Jul 16, 2023 | 10:22 AM

Telangana Politics Have A New Trend Parties Giving Tickets To Old Candidates

Telangana Politics: ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొన్ని చోట్ల కొత్త ముఖాలు కనపడుతుంటాయి. అన్ని పార్టీలు అన్నో, ఇన్నో సీట్లు కొత్త వారికి కేటాయిస్తుంటాయి. కానీ ఈసారి తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొత్తవాళ్లు వద్దు.. పాత వాళ్లే ముద్దు అంటున్నాయి పార్టీలు. ఇంతకీ కొత్త ముఖాలపై పార్టీల విముఖత ఎందుకు…?
తెలంగాణలో పొలిటికల్ సీన్ రోజురోజుకు హాట్ హాట్‌గా మారుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు జోరు పెంచాయి. నాలుగేళ్లుగా జనంతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న నేతలు ముఖాలపై నవ్వు పులుముకుని హలో మేమున్నాం అంటూ పలకరింపులు మొదలుపెట్టేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అనిలేదు. అన్ని పార్టీల నేతలు ఆపరేషన్ ఎలక్షన్స్ ప్రారంభించేశారు. సిట్టింగులు, టికెట్లు ఆశిస్తున్నవారు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారు, కొంతకాలం పోటీకి దూరంగా ఉన్న వారు, వాళ్లు వీళ్లు అని లేదు అందరూ జనంబాట పడుతున్నారు.
తెలంగాణలో ఈసారి కాస్త విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నలుగురు టికెట్లు ఆశిస్తుంటారు. వారిలో పాత వారుంటారు. కొత్త ముఖాలు ఉంటాయి. పరిస్తితిని బట్టి పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి అన్ని పార్టీలు పాతవాళ్ల వైపే మొగ్గుచూపుతున్నాయి. కొత్త వాళ్లకు ప్రస్తుతానికి సీట్లు లేవని చెబుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం అంటున్నాయి పార్టీలు. సొమ్ములు కుమ్మరిస్తామంటున్నా వెయిట్ అండ్ సీ పాలసీని అవలంభిస్తున్నాయి. అధికార పార్టీలో ఇటీవలి వరకు ఓ చర్చ నడిచింది. కొంతమంది సిట్టింగ్‌లను మార్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ వాదనలకు ఇటీవల ముగింపు పలికారు కేసీఆర్. మెజారిటీ ఎమ్మెల్యేలకు సీట్లు గ్యారెంటీ అని చెప్పారు. గాడి తప్పిన కొందరికి తప్ప మిగిలిన అందరు సిట్టింగ్‌లకు టికెట్లపై ఇబ్బందిలేదు. ఆ కొన్ని సీట్లలో కూడా కొత్త వారికి అవకాశం దక్కడం కష్టమే. పాతవారికి అందులోనూ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్నవారికే అవకాశం ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఇక కాంగ్రెస్‌లో అయితే టికెట్ల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది. పార్టీ గ్రాఫ్ కాస్త పెరగడంతో నిన్నటివరకు ఇన్ యాక్టివ్‌గా ఉన్న నేతలు కూడా ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. పోటీకి నై అన్నవాళ్లు ఇప్పుడు సై అంటున్నారు. పైగా కాంగ్రెస్‌లో గతంలో పోటీ చేసిన నేతలు ఎక్కువమందే ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం నలుగురైదుగురు సీనియర్లతో పాటు కొందరు జూనియర్లు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. కొత్తవారు కూడా చాలామందే ఉన్నా పాతవారివైపే పార్టీల పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వారిలో పోటీ చేసిన అనుభవం ఉన్నవారు, పార్టీ కాస్త వీక్‌గా ఉన్న నియోజకవర్గాలకు చెందిన వారిని తీసుకుని టికెట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సై అంటోంది. బీజేపీలో కూడా అదే పరిస్థితి. ఆ పార్టీలో పోటీ చేసిన అనుభవం ఉన్నవారున్నారు. కానీ గెలిచిన అనుభవం ఉన్నవారు లేరు. చాలా సీట్లలో ఆ పార్టీకి పోటీచేసే స్థాయి ఉన్న నేతలు కూడా లేరు. దీంతో మిగిలిన పార్టీల నుంచి చేరికలపైనే ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పోటీ ఎక్కువగా ఉండటంతో టికెట్లు దక్కని సీనియర్ నేతలు తమవైపు వస్తారన్నది బీజేపీ అంచనా. అది కూడా సీనియర్ నేతలకే అవకాశం అంటోంది.
ఈ ఎన్నికలు టగ్ ఆఫ్ వార్‌ను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. హోరాహోరీగా సాగే ఎన్నికల్లో ప్రతి సీటూ కీలకమే. ఆ ఒక్క సీటే పొలిటికల్ సీన్‌ను మార్చేస్తుంది. అందుకే కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు పార్టీలు భయపడుతున్నాయి. గతంలో ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం లేకపోతే పోటీలో ఎక్కడ వెనకబడిపోతామేమోనన్న టెన్షన్ పార్టీల్లో ఉంది. అందుకే చాలా మంది పోటీకి సై అంటున్నా నో అంటున్నాయి. ఒకరిద్దరు భారీగా సొమ్ములు గుమ్మరించే వారికి మాత్రమే అవకాశం దక్కుతుందంటున్నారు.
మొత్తంగా చూస్తే ఈసారి కొత్తవారికంటే అనుభవమున్న నేతలవైపే పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.