Telangana Politics: కర్ణాటక ఎన్నికల తర్వాత భారీ మార్పులు.. తెలంగాణ రాజకీయం ఏ టర్న్ తీసుకోబోతుంది?
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయం బయటపడుతుంది. కన్నడ ఓటర్ల తీర్పు మీదే తెలంగాణ రాజకీయం ఆధారపడి ఉండడం ఖాయం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. మూడు పార్టీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చాలా కీలకం. ఆ ఫలితాల మీదే.. ఈపార్టీల భవిష్యత్ అడుగులు ఆధారపడి ఉంటాయి.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రజా ఆశీర్వాదం అని బీఆర్ఎస్… హాత్ సే హాత్ జోడో అని కాంగ్రెస్.. సభలు, సమావేశాలు అంటూ బీజేపీ.. ఇలా ఎవరికి వారు జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం స్పష్టం.. ఈసారి జరగబోయేవి అలాంటిలాంటి ఎన్నికలు కావు.. అందుకే తెలంగాణ వైపే చూస్తోంది దేశమంతా! అధికారం ఎవరిదో టక్కున చెప్పలేని పరిస్థితి. దీంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నివురు గప్పిన నిప్పులా కనిపిస్తోంది తెలంగాణ రాజకీయం. అసలు వేడి.. కర్ణాటక ఎన్నికల తర్వాత బయటపడుతుంది. కన్నడ ఓటర్ల తీర్పు మీదే తెలంగాణ రాజకీయం ఆధారపడి ఉండడం ఖాయం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. మూడు పార్టీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చాలా కీలకం. ఆ ఫలితాల మీదే.. ఈపార్టీల భవిష్యత్ అడుగులు ఆధారపడి ఉంటాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అసలు సిసలు పొలిటికల్ గేమ్ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడం ఖాయం. అదే జోష్‌లో తెలంగాణలోనూ అధికారం దిశగా పావులు కదుపుతుంది. ఒకవేళ కర్ణాటకలో ఓడిపోతే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఇక్కడి నాయకులకు పార్టీ మీద నమ్మకం పోతుంది.
జంపింగ్ జపాంగ్ అనేందుకు దారులు వెతుక్కుంటారు. తెలంగాణలో చేరికలను భారీగా ప్రోత్సహిస్తున్న బీజేపీకి.. ఇది ప్లస్ అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ దాదాపు పుల్ కావడంతో.. కాంగ్రెస్ నుంచి దిక్కులు చూసే నేతలకు బీజేపీ గాలం వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రంలో కమలం పార్టీ మరింత బలంగా మారుతుంది. ఇక కర్ణాటక ఫలితాలు బీజేపీకి కూడా చాలా కీలకం. అక్కడ గెలిస్తే.. అదే వ్యూహాలు తెలంగాణలోనూ అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోతే మాత్రం మరో స్ట్రాటజీ సిద్ధం చేసే చాన్స్ ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా కన్నడ ఫలితాలను ఆసక్తిగా గమనిస్తోంది. అక్కడ కమలం పార్టీకి పరాభవం ఎదురైతే.. ఢిల్లీ మీద దండయాత్రను కేసీఆర్ మరింత స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది.
బీజేపీ పని అయిపోయిందనే ప్రచారాన్ని మరింత జోష్‌గా జనాల్లోకి, రాజకీయవర్గాల్లోకి తీసుకెళ్తారు. ఎలా చూసినా.. కర్ణాటక ఎన్నికలు తెలంగాణ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరుగుతున్న మాటల యుద్ధాలు, విమర్శలు జస్ట్ శాంపిల్ మాత్రమే. కర్ణాటక ఫలితాలు వచ్చాక మొదలవుతుంది అసలు సినిమా. తెలంగాణ రాజకీయం కీలక మలుపులు తీసుకోవడం ఖాయం.