Elections In Telangana: ఎలక్షన్ మూడ్‌లో తెలంగాణ..? పార్టీల్లో కంగారు..? అక్టోబర్‌లోనే ఎన్నికలు..?
సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అక్టోబర్‌లో పోలింగ్ ఉటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. అక్టోబర్‌లో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు సూచించారు.
Elections In Telangana: తెలంగాణ పూర్తిగా ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. పార్టీలన్నీ ఇప్పుడు ఎలక్షన్స్ మీదే ఫోకస్ చేశాయి. షెడ్యూల్‌కంటే ముందుగానే తెలంగాణలో ఎన్నికలు రావొచ్చని పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చేశాయి. దీంతో రాజకీయ పార్టీలు బిజీగా మారి.. నేతల చేరికలు, మేనిఫెస్టో, యాత్రలు, వివిధ కార్యక్రమాలతో హడావిడి చేస్తున్నాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే.. డిసెంబర్‌లో ఎన్నికలు జరగాలి. అక్టోబర్‌లో నోటిఫికేషన్ రావాలి. కానీ, ఈసారి అక్టోబర్‌లోనే ఎన్నికలు జరగొచ్చు. సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అక్టోబర్‌లో పోలింగ్ ఉటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. అక్టోబర్‌లో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు సూచించారు. అయితే, నిజంగానే అక్టోబర్‌లో ఎన్నికలు జరుగుతాయా.. లేక పార్టీ నేతల్ని అప్రమత్తం చేసేందుకు అలా చెప్పారా అనే సందేహాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి అనుగుణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలు సాగుతున్నాయి. కొత్త పథకాల ప్రకటన, అమలులో వేగం పెంచుతోంది ప్రభుత్వం.
అభ్యర్థుల జాబితాతో సిద్ధం
ఎన్నికల్లో గెలవాలంటే కీలకమైంది అభ్యర్థుల ప్రకటన. అందుకే పార్టీలు ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపై కసరత్తు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే మొదటి జాబితా సిద్ధం చేశారు. అధికమాసం ముగియడం, శ్రావణ మాసం రావడంతో మంచి ముహూర్తం చూసుకుని బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ప్రకటన అనంతరం కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించబోతుంది. కాకపోతే బీఆర్ఎస్‌లో టిక్కెట్లు దొరకని అభ్యర్థులు, తమ పార్టీలో చేరుతారనే ఆశతో ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఇదే పనిలో బిజీగా ఉంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అలాగే మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ కొన్ని ప్రజాకర్షక పథకాల్ని ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా ఉచిత పథకాలు, వివిధ ప్రజాకర్షక హామీల్ని ఇవ్వబోతుంది. కర్ణాటక తరహాలో పథకాల్ని ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ కూడా ఇదే దారిలో ఉంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కీలక నేతల్ని ఢిల్లీ పిలిపించుకుని అధిష్టానం ఎన్నికలపై సూచనలు చేస్తోంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతోంది.
ఆరు నెలల ముందే ఎన్నికలు
తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు వచ్చే జనవరికల్లా అసెంబ్లీ పదవీ కాలం పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం అయితే, ఆలోపే ఎన్నికలు జరుగుతాయి. అయితే, నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందే ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితులు, ఇతర కారణాల రీత్యా ఆరు నెలల ముందుగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, ఎలక్షన్స్ నిర్వహించవచ్చు. ఈ లెక్కన తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎలక్షన్స్ ఎప్పుడైనా రావొచ్చు.