Telangana BJP: తెలంగాణలో బీజేపీ ఖేల్ ఖతం.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పొలిటికల్ వార్..!
బీజేపీని బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా ఇటీవల కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారు. ధరణి, ఓఆర్ఆర్ ప్రాజెక్టు వంటి అంశాలపై రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు.
Telangana BJP: తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్-బీజేపీగా ఉన్న పొలిటికల్ వార్ ఇప్పుడు బీఆర్ఎస్-కాంగ్రెస్‌గా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా సత్తా చాటిన బీజేపీ నెమ్మదిగా బలహీనపడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు, బీజేపీలో అంతర్గత కలహాలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయి. ఒకవైపు విమర్శలు, ప్రతి విమర్శలతో కాంగ్రెస్-బీఆర్ఎస్ పొలిటికల్ రేసులో దూసుకెళ్తుంటే.. బీజేపీ ఎక్కడుందో అక్కడే ఆగిపోయింది.
బీజేపీని బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా ఇటీవల కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారు. ధరణి, ఓఆర్ఆర్ ప్రాజెక్టు వంటి అంశాలపై రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌కు అంతే ధీటుగా బదులిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలపైనే తెలంగాణ ప్రజల ఫోకస్ మారింది. ఉన్నట్లుండి బీజేపీ సైడైపోయింది. ఆ పార్టీ నేతలు పెద్దగా కనిపించడం లేదు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం లేదు. బీఆర్ఎస్ కూడా ఆ పార్టీని పట్టించుకోవడం లేదు. దీంతో బీజేపీ నేతలకు తెలంగాణలో పెద్దగా పని లేకుండా పోయింది. బండి సంజయ కూడా అప్పుడప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మిగతా నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. అసలు రెండు పార్టీల మధ్య ఏదైనా ఒప్పందం కుదిరిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి రాజకీయ వర్గాల్లో. బీజేపీ-బీఆర్ఎస్ రెండూ ఒకటే అని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
టీ బీజేపీలో ముసలం..?
ప్రభుత్వంపై పోరాడటం సంగతి పక్కనబెడితే.. బీజేపీలో నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒకరితో మరొకరికి పడటం లేదు. నేతలు కలిసికట్టుగా పనిచేయడం లేదు. బండి సంజయ్‍పై ఈటల, విజయశాంతి, ఇతర నేతలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో కోవర్టుల అంశం కలకలం రేపుతోంది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. నిన్నామొన్నటివరకు ఈ పరిస్థితి కాంగ్రెస్‌లో ఉండది. కానీ, ఇప్పుడు బీజేపీలో ఈ పరిస్థితి తలెత్తింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మారుస్తున్నారనే ప్రచారం కూడా ఆ పార్టీని దెబ్బకొట్టింది. అలాగే బీజేపీకి చెందిన కీలక నేతలు త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కూడా బీజేపీని దెబ్బతీసింది. వీటి వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్దాగుందన్నది కొందరి వాదన. ఏదేమైనా పార్టీలో కీలక నేతలే పరస్పర విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేస్తుంటే కిందిస్థాయి నేతలకు పనేం ఉంటుంది. దీంతో కొద్ది రోజులుగా బీజేపీలో యాక్టివ్‌నెస్ తగ్గింది. పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా తయారైంది. దీనికి తగ్గట్లే కాంగ్రెస్ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.