Chandrababu Over Confidence : అంత ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దు బాబుగారు..! ఇలాగైతే మునిగిపోతారు.. జాగ్రత్త..!!

కాన్ఫిడెన్స్‌ మంచిది.. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ముంచుద్ది.. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు కేడర్‌కు చెబితే మంచిది. లేకపోతే వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ రిపేర్ చేయించడానికి కూడా పనికి రానంతగా పాడైపోతుందని తెలుసుకోవాలి. వేవ్‌ వచ్చిందని తెలుగు తమ్ముళ్లు ఓ తెగ ఊగిపోతున్నారు. కానీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు పోతే మొదటికే మోసం వస్తుందని మీరైనా చెప్పండి చంద్రబాబుగారు.!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2023 | 12:24 PMLast Updated on: Apr 24, 2023 | 11:49 AM

Telugu Desam Party Over Confidence

వేవ్‌ వచ్చేసింది.. జనం వైసీపీపై తిరగబడుతున్నారు.. నెక్స్ట్‌ వచ్చేది మనమే.. ఇంకో ఏడాది మాత్రమే వైసీపీ.. ఆ తర్వాతంతా మన రాజ్యమే.. ఇవీ టీడీపీ నేతల కామెంట్లు. అధికారంలోకి వచ్చేశామన్నట్లు వ్యవహరిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రజల్లో టీడీపీ పట్ల కొంత వేవ్‌ వచ్చిన మాట నిజమే… అంటే దానర్ధం ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలై టీడీపీకి అది లాభిస్తుందని.. ఇప్పటికిప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చేసినట్లు కాదు.. కానీ దాన్ని గుర్తుంచుకోకుండా అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమాతో అతివిశ్వాసానికి పోతున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ అతివిశ్వాసానికి పోయింది. జనంలో వైసీపీ వేవ్‌ ఉందన్న ఈ అతివిశ్వాసం గతంలోనూ కొంపముంచింది. అది మర్చిపోయి మళ్లీ అదే తప్పు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2019లో గెలుస్తామన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు వెళ్లింది టీడీపీ. అప్పట్లో కొన్ని సర్వేలు పరిస్థితి దారుణంగా ఉందని చెప్పినా జాగ్రత్త పడలేదు. మేమే గెలుస్తామంటూ ఓవర్‌ కాన్ఫిడెన్స్ చూపారు. ఏమైంది… దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అప్పుడు ఓడతామని చెబితే అతి విశ్వాసానికి పోయారు. ఇప్పుడు గెలుస్తామని ధీమాకు పోతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి కొంత మంచి ఫలితాలే వచ్చాయి. దాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అదే జరుగుతుందని అనుకుంటే అది భ్రమే. ఆ ఓట్లు వేసింది ఓ వర్గం ఓటర్లే. వారిలో మార్పు వచ్చి ఉండొచ్చు. కానీ మిగిలిన వారిలో కూడా రావాలి కదా…! ఆ ఓట్లను చూసి వచ్చే ఎన్నికల్లో జనమంతా తండోపతండాలుగా తరలివచ్చి గంపగుత్తగా ఓట్లు తమకే వేస్తారని అనుకోవడం సరికాదు…! 2014 ఎన్నికలకు ముందు కూడా జగన్‌ బ్యాచ్‌ ఇలాంటి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కే పోయింది. దాంతో ఎన్నికలను లైట్ తీసుకున్నారు. ఫలితంగా ఐదేళ్లు అధికారం దూరమైంది.

ప్రజల్లో టీడీపీకి కొంత వేవ్ ఉన్నమాట నిజం… కేడర్‌ను ఉత్సాహపరచడం కోసం, ఎన్నికల ఏడాదిలో స్తబ్ధుగా ఉన్న కార్యకర్తలను కదలించడం కోసం వేవ్‌ ఉందన్న విషయాన్ని బాగా కార్యకర్తలకు నూరిపోసింది టీడీపీ హైకమాండ్. దీని వెనకున్న ఉద్దేశం కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపి ఎన్నికల ఏడాదిలో దూకుడుగా వెళ్లడమే. కానీ టీడీపీ శ్రేణులు దాన్ని వేరేగా అర్ధం చేసుకున్నట్లున్నాయి. గెలిచేశామన్నట్లు భావిస్తున్నాయి. ఇది పార్టీకి ఏమంత మంచిది కాదు… జనంలో సానుకూల పవనాలు వీస్తున్నప్పుడే జాగ్రత్తపడాలి. మరింత దూకుడుగా, వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి. కానీ గెలిచేసాం అని నిద్రపోతే కుందేలు, తాబేలు కథలా అవుతుంది.

అవునన్నా కాదన్నా ప్రస్తుతం టీడీపీ కంటే వైసీపీకి మంచి ఆర్థిక బలముంది. పైగా ప్రస్తుతం అధికారంలో ఉంది. ఆ పార్టీకి మంచి కేడర్‌ కూడా ఉంది. కొన్ని వర్గాల సపోర్ట్‌ ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి పరోక్ష మద్దతు ఉంది. అన్నింటికీ మించి ఇంకా ఎన్నికలకు ఏడాది ఉంది. ఈలోపు మళ్లీ పరిస్థితుల్ని తనవైపు తిప్పుకోవచ్చు… పోల్‌ మేనేజ్‌మెంట్‌లో వైసీపీ కూడా రాటుదేలిపోయింది. జగన్‌ను తక్కువ అంచనా వేస్తే అది టీడీపికి నష్టం… వైసీపీ అభివృద్ధి చేయకపోయినా 50శాతం మంది ఓటర్లకు ఏదోరూపంలో డబ్బు అందేలా చేసింది. దాన్నుంచి వారిని బయటకు తెచ్చి తమకు ఓటేసేలా చేసుకోవడం టీడీపీకి పెద్ద టాస్క్. కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతల మధ్య గొడవలుండొచ్చు. అంత మాత్రం చేత అన్నిచోట్లా అలాంటి పరిస్థితే ఉండదు. దాన్ని చూసి వైసీపీలో ఏదో జరిగిపోతుందన్న అంచనాలకు వస్తే టీడీపీకే నష్టం.

జనంలో ఇప్పుడే కాస్త సానుకూల సంకేతాలు మొదలయ్యాయి. అంతే కానీ పూర్తిగా వైసీపీని ఓడించేంత రాలేదు. దాన్ని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి. మేమే గెలిచేస్తామని విర్రవీగితే అసలు సమయంలో బొక్క బోర్లా పడే అవకాశం ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. మాకు అధికారం వచ్చేసిందని కాలరెగరేస్తే అసలుకే ఎసరు పెడతారు.