BRS-YSRCP: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుతో తెలుగు పార్టీల్లో ఎవరెటో తేలిందా..?
ఏపీలో వైసీపీ అధికార పార్టీ అయితే.. టీడీపీ ప్రతిపక్షం. కానీ, ఈ రెండు పార్టీలూ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు మద్దతిస్తున్నాయి. అలాగని రెండు పార్టీలూ ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరలేదు. ఎన్డీయేకు అవసరమైనప్పుడల్లా బయటినుంచి మద్దతిస్తున్నాయి.
BRS-YSRCP: కేంద్ర రాజకీయాలకు సంబంధించి రెండే కూటములున్నాయి. ఒకటి అధికార కూటమి.. రెండోది ప్రతిపక్ష ఇండియా కూటమి. ప్రతిరాష్ట్రం నుంచి పార్టీలు ఈ రెండింట్లో ఏదో ఒక కూటమివైపో చేరిపోయాయి. కానీ, ఏ కూటమిలోనూ చేరని కీలక పార్టీలు తెలుగు రాష్ట్రాలవే కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీతోపాటు టీడీపీ కూడా ఏ కూటమిలోనూ లేదు. ఈ మూడు పార్టీలకు సంబంధించి విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీలో వైసీపీ అధికార పార్టీ అయితే.. టీడీపీ ప్రతిపక్షం. కానీ, ఈ రెండు పార్టీలూ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు మద్దతిస్తున్నాయి. అలాగని రెండు పార్టీలూ ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరలేదు. ఎన్డీయేకు అవసరమైనప్పుడల్లా బయటినుంచి మద్దతిస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వైసీపీ, టీడీపీ అనుకూలంగా ఓటు వేశాయి. అలాగే తెలంగాణకు సంబంధించి అధికార బీఆర్ఎస్ కూడా రెండు కూటములకు దూరంగా ఉంటోంది. ఎన్డీయే, ఇండియా కూటమిలోనూ చేరలేదు.
ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. అలాగని ఇండియా కూటమికి కూడా మద్దతు తెలపలేదు. ఈ బిల్లు విషయంలో ఎన్డీయేను వ్యతిరేకించింది అంతే. ఇండియాకు కూడా దూరంగానే ఉంటోంది. ప్రధాన తెలుగు పార్టీలు కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం లేదు. వివిధ బిల్లుల విషయంలో మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. ఏపీ అధికార పార్టీ వైసీపీ మాత్రం ప్రతిసారీ బేషరతుగా బీజేపీకి అనుకూలంగా ఉంటోంది. ఆ పార్టీ అవసరం అలాంటిది. బీఆర్ఎస్ కూడా గతంలో బీజేపీకి అనుకూలంగానే ఉండేది. కానీ, కొంతకాలంగా ఆ పార్టీకి దూరం జరిగింది. అలాగని కాంగ్రెస్‌తో కూడా కలిసే సూచనలు లేవు. ప్రస్తుతం రెండింటికీ బీజేపీ సమదూరం పాటిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ పోటీ చేయబోతుంది.
ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన సీట్లను బట్టి ఏ కూటమికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకుంటుంది. కేంద్రంలో ఈసారి ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని.. తమ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీఆర్ఎస్ చెబుతోంది. 2024 ఎన్నికల వరకు తెలుగు రాష్ట్రాల పార్టీలకు జాతీయ కూటములతో పెద్దగా పని లేదు. ఆ తర్వాత ఫలితాల్ని బట్టి ఎవరెటో తేలుతుంది.