Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. బండారు అరెస్టు తప్పదా..? కొనసాగుతున్న ఉద్రిక్తత..!
బండారు ఇటీవల మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు.
Bandaru Satyanarayana: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు అరెస్టు.. మరోవైపు పవన్ వారాహి యాత్రతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి రోజాపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు మరింత మంట రాజేశాయి. దీంతో బండారుపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఏపీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో బండారును పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరగడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని బండారు ఇంటి వద్ద పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.
బండారు ఇటీవల మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. బండారు వ్యాఖ్యలపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పరవాడ డీఎస్పీ కెవీ సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. బండారుకు 41ఏ నోటీసు జారీ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో టీడీపీ కార్యకర్తలు బండారు ఇంటికి తరలివచ్చి, పోలీసుల్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. బండారు ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లోనే ఉంటే అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బండారును అరెస్టు చేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పోలీసుల్ని అడ్డుకుంటున్నారు. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు.
మరోవైపు పోలీసుల తీరుపై బండారు సతీమణి మాధవీలత పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా.. అర్ధరాత్రి తమ ఇంటికొచ్చి, పోలీసులు తమను నిర్బంధించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు భయభ్రాంతులకు గురి చేసినట్లు ఫిర్యాదు చేశారు. తమన ఇబ్బందులకు గురి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.