Vijaya Shanthi: బీజేపీలో విజయశాంతి అలక.. పార్టీ మార్పుకోసమేనా..?
ఏపీకి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంపై విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి రాకను నిరసిస్తూ ఆమె సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ట్వీట్ చేశారు.
Vijaya Shanthi: తెలంగాణ బీజేపీలో కలహాల కాపురం ఇంకా నడుస్తోంది. అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం సమయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది. ఏపీకి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంపై విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి రాకను నిరసిస్తూ ఆమె సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ట్వీట్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విజయశాంతి అంశం చర్చకు దారితీస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించిన మాట నిజమే. తర్వాత రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ ఏర్పడింది. ఆ తర్వాత తొమ్మిదేళ్లలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. నాటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది.. ఇప్పుడు కాషాయ జెండా కప్పుకున్నారు. బీజేపీ అగ్రనాయకత్వమే ఆయనకు పెద్ద పీట వేసింది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ బీజేపీ నేతలను కూడా ఆహ్వానించారు. వారిలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకే, ఇతర నేతలతో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పైగా జాతీయ పార్టీ అన్నాక అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు వివిధ సందర్భాల్లో కలుస్తూ ఉంటారు. నల్లారి కూడా అలాగే వచ్చి ఉండొచ్చు. ఎంతో అనుభవం కలిగిన విజయశాంతి ఇది అర్థం చేసుకోకపోతే ఎలా..? కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమానికి వచ్చినంత మాత్రాన ఏదో తప్పు జరిగిందన్నట్లుగా అలిగి వెళ్లిపోతే ఎలా..? పైగా ఆయనను బీజేపీ అధినాయకత్వమే స్వాగతించి పార్టీలో చేర్చుకుంది కదా..!
సుజనా చౌదరి, సీఎం రమేశ్, పురంధేశ్వరి లాంటి ఏపీ నేతలు కూడా నాడు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాళ్లంతా బీజేపీ కండువా కప్పుకొని తిరుగుతున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఒక్కరిని కూడా బీజేపీలో చేర్చుకునేది లేదని బీజేపీ జాతీయ స్థాయిలో ఏదైనా విధానం పెట్టుకుని ఉంటే అప్పుడు నల్లారితో పాటు అందర్నీ వ్యతిరేకించవచ్చు. కానీ అమిత్ షా, నద్దాకు లేని అభ్యంతరం విజయశాంతికే ఎందుకో? రాములమ్మ త్వరలోనే కమలానికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ సీనియర్ నేతలతో టచ్‌లో ఉన్నట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగానే విజయశాంతి ఇప్పటి నుంచే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం మొదలు పెట్టారన్నది ఒక వాదన. కొన్నేళ్ల క్రితం రాజాసింగ్‌పైనా అసంతృప్తి వ్యక్తం చేసిన విజయశాంతి తాజాగా నల్లారిని టార్గెట్ చేయడం పార్టీ మార్పునకు సంకేతమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.