ఉగ్రవాదమా.. ఆర్థిక సాయమా తేల్చుకో.. పాకిస్తాన్‌కు స్పాట్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్
ఊహించినట్టే ట్రంప్ 2.O సర్కార్ పాకిస్తాన్ భరతం పడుతోంది. తన మొదటి పాలనలోనే ఇస్లామాబాద్ మెడలు వంచిన ట్రంప్.. ఇప్పుడూ అదే చేయబోతున్నట్టు తన చర్యలతో తేల్చి చెప్పేశారు. ఫస్ట్ టర్మ్‌లో పాక్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేసిన ట్రంప్..
ఊహించినట్టే ట్రంప్ 2.O సర్కార్ పాకిస్తాన్ భరతం పడుతోంది. తన మొదటి పాలనలోనే ఇస్లామాబాద్ మెడలు వంచిన ట్రంప్.. ఇప్పుడూ అదే చేయబోతున్నట్టు తన చర్యలతో తేల్చి చెప్పేశారు. ఫస్ట్ టర్మ్‌లో పాక్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేసిన ట్రంప్.. ఇప్పుడు పౌర సహాయాన్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తొలిరోజే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినా ఇటీవలే ఆ పూర్తి సమాచారం బయటకు వచ్చింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇస్లామాబాద్‌ను ట్రంప్ నిర్ణయాలు మరింత పాతా ళానికి తొక్కేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, పాకిస్తాన్ విషయంలో అప్పుడూ ఇప్పుడూ డొనాల్డ్ ట్రంప్ ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఏటా ఇచ్చే పౌర సహాయాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్‌కు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
అగ్రరాజ్యం అవకాశవాదాన్ని, తన ఉగ్రవాద అసుర వేదాన్ని కలగలిపిన పాకిస్తాన్ కుటిలనీతి కారణంగానే ఉపఖండంలో ప్రచ్ఛన్నయుద్ధం ప్రజ్వరిల్లి వేలమంది అభాగ్యుల ప్రాణాల్ని కబళించడం నేటికీ నడుస్తున్న రక్త చరిత్ర. సుమారు రెండు దశాబ్దాలుగా అమెరికా తెలివి తక్కువతనంతో పాకిస్తాన్‌కు మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆర్ధిక సాయం అందించింది. మన నేతల్ని వెర్రివాళ్లుగా జమకట్టి అబద్ధాలు, నమ్మకద్రోహాన్నే ప్రతిఫలంగా బదులిచ్చింది. మనం వేటాడుతున్న ఉగ్రవాదులకు తమదేశం లో ఆశ్రయం కల్పిస్తోంది. ఆ పరిస్థితులకు ఇప్పుడు పూర్తిగా అడ్డుకట్ట పడబోతోంది. ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. ట్రంప్ వస్తే ఏం జరుగుతుందో ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. ట్రంప్ తొలి పాలనలోనే ఆ దేశానికి చుక్కలు చూపించారు. 2016 ఆర్థిక సంవత్సరానికి గానూ పాకిస్తాన్‌కు ఇవ్వ దలచిన 17 వందల కోట్ల నిధులను ట్రంప్ ఆపేశారు. తామిస్తున్న నిధులు పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరుకి కాక.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వాడుతోందని అంతర్జాతీయ సమాజం ముందే కడిగిపారేశారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తమకు తోడ్పాటు అందిస్తున్నందుకుగాను ఇస్లామాబాద్‌కు 4వేల 600 కోట్లు కేటాయించింది అమెరికా. కానీ, ఆ నిధులకు, ఉగ్రసంస్థ లష్కరేపై చర్యలకు ముడిపెట్టింది. అమెరికా వేటాడుతున్న హక్కానీ నెట్‌వర్క్ సహా పాకిస్తాన్ గడ్డపై కొలువుతీరిన 20 ఉగ్రవాద సంస్థలు, 75మంది ఉగ్రవాదుల పేర్లతో కూడిన జాబితాను నాటి విదేశాంగమంత్రి టిల్లర్‌సన్- అప్పటి అబ్బాసీ ప్రభుత్వానికి అందించారు. కానీ, ఎప్పట్లానే పాకిస్తాన్ అమెరికా ఇచ్చిన నిధులను ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కాకుండా పెంచి పోషించడానికి ఖర్చు చేసింది. పైగా కశ్మీర్ వివాద పరిష్కర్తగా చరిత్రకు ఎక్కాలని భావి స్తున్నట్టు ప్రకటించిన ముషారఫ్.. అమెరికా నిధులను దారి మళ్ళించి ఉగ్రశక్తుల్ని అల్లారుముద్దుగా సాకానని కొన్నేళ్ల క్రితమే గొప్పగా చాటుకొన్నారు. కశ్మీర్‌కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమన్న అజెండాకే కట్టుబడిన పాలకులంతా ఉగ్రవాదానికి నారూనీరూ పోసి తరించిపోతున్నారు. ఇది తెలుసుకున్న ట్రంప్ పాకిస్తాన్‌ను ఇకపై నయా పైసా ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. ఫలితంగా సైనిక సాయం నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ, బైడెన్ వచ్చిన తర్వాత పౌర సహాయం మాత్రం కొనసాగుతూ వచ్చింది.
ట్రంప్ మొదటి పాకిస్తాన్‌కు ఏకంగా రెండు 17వేల 242 కోట్ల వార్షిక సైనిక సాయాన్ని నిలిపేశారు. కానీ, 2020లో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత పాకిస్తాన్‌కు భారీగా ఆర్థిక సాయం చేశారు. 2024 ఇస్లామాబాద్‌కు 16 మిలియన్ డాలర్లు అంటే 138 కోట్లు పౌర సాయంగా అందించారు. అంతకు ముందే 2023-22లో ఇస్లామాబాద్‌కు ఏటా 80 మిలియన్ డాలర్లు అంటే 690 కోట్లు పౌర సహాయంగా అందించారు. ఈ మొత్తాన్ని పాకిస్తాన్‌లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న జనాభా అభ్యున్నతికి ఉపయోగించాలని చెప్పారు. పాక్ పాలకులు ఆ నిధులను అమెరికా చెప్పినట్టే ఖర్చుచేసి ఉంటే ఆ దేశ ప్రజలకు ఈ పరిస్థితులు వచ్చుండేవే కావు. బైడెన్ సర్కార్ ఇచ్చిన నిధులను కూడా పాక్ పాలకులు తమ జల్సాలకూ, ఉగ్రవాదాన్ని భారత్‌లో ఎగదోయడానికే ఖర్చు చేశారు. డొనాల్డ్ ట్రంప్ సైతం ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ లెక్క సరిచేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోగానే వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు పెట్టారు ట్రంప్. వాటిలో చాలా వరకూ వివాదాస్పద అంశాలే ఉండటంతో అందరి దృష్టీ వాటి పైనే పడింది. కానీ, అదే రోజు ట్రంప్ మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం అందించే పౌర సహాయాన్ని నిలివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 90 రోజుల పాటు ట్రంప్ నిర్ణయం అమలులో ఉంటుంది. CNN నివేదిక ప్రకారం, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 17న అన్ని దేశాల దౌత్య కార్యాలయాలకూ ఈ సమాచారాన్ని పంపారు. ట్రంప్ పౌర సహాయాన్ని నిలి పేసిన దేశాల జాబితాలో మొదటిది పాకిస్తానే. 90 రోజుల తర్వాత ట్రంప్ మనసు మార్చుకున్నా పాకిస్తాన్ విషయంలో మాత్రం అది ఎప్పటికీ జరగదు. అంటే ట్రంప్ పవర్‌లో ఉన్నంత కాలం పాకిస్తాన్‌కు నయా పైసా కూడా అమెరికా నుంచి అందదు. అమెరికా పౌర సహాయం ఆపేసినంత మాత్రాన ఏం జరుగుతుంది అనుకోవచ్చు.. పాకిస్తాన్ స్థితిగతుల్ని అల్లా, ఆర్మీ, అమెరికాలే నిర్దేశిస్తుంటాయంటారు. అలాంటి అమెరికా హ్యాండ్ ఇవ్వడం అంటే పాకిస్తాన్ కథ ముగియడమే.