Tamilnadu: తమిళనాట మరో హీరో రాజకీయ ప్రవేశం..!?
రజనీకాంత్ తర్వాత తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఎంతోకాలంగా కోరుతున్నారు. అయితే విజయ్ మాత్రం ఎప్పుడూ తన ఆసక్తిని వెల్లడించలేదు.
తమిళనాడులో సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లకు కొదువలేదు. ఎంజీఆర్, జయలలిత, విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే తమిళనాట సినీరంగం నుంచి వచ్చిన వాళ్లే రాజకీయాలను శాసిస్తూ ఉంటారు. అందుకే సినీ ప్రముఖులు చాలా మంది రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఆమధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పాలిటిక్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పార్టీ కూడా అనౌన్స్ చేశారు. కానీ వయసు పైబడడంతో తాను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే వార్తలు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి.
రజనీకాంత్ తర్వాత తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఎంతోకాలంగా కోరుతున్నారు. అయితే విజయ్ మాత్రం ఎప్పుడూ తన ఆసక్తిని వెల్లడించలేదు. కానీ పలు సేవా కార్యక్రమాల ద్వారా ఆయన నిత్యం ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తమిళులకు ఏ ఆపద వచ్చినా తాను ఉన్నానంటూ ముందుంటున్నారు. ఇటీవల పది, పన్నెండో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ 3 విద్యార్థులను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. వాళ్ల తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓటు విలువపై విజయ్ చేసిన కామెంట్స్ ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే సంకేతాలిచ్చాయి.
తాజాగా 15 జిల్లాలకు చెందిన తన ఫ్యాన్స్ అసోసియేషన్స్ తో విజయ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆయా జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది.. ప్రజలు ఏం ఆశిస్తున్నారు.. లాంటి అనేక అంశాలపై విజయ్ చర్చించారు. త్వరలో మిగిలిన జిల్లాల ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను కూడా పిలిపించి మాట్లాడతారని టాక్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈలోపు రాజకీయాలపై పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు విజయ్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే బాగా వీక్ అయింది. ఆ లోటును విజయ్ భర్తీ చేస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.