Kadiyam Srihari: కడియంతో దోస్తీకి సిద్ధమైన రాజయ్య.. నిజంగా కలిసిపోయారా.. షాక్ ఇస్తారా..?

కేటీఆర్ సమక్షంలో రాజయ్య, కడియం శ్రీహరి కలిపోయారు. చేతులు కలుపుకున్నారు. శ్రీహరి కడుపు మీద చేయి పెట్టి మరీ.. తన ఆప్యాయత చూపించారు రాజయ్య. ఇదంతా బయటకు కనిపించే సీన్. నిజంగా ఇది నిజమా అంటే.. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అంటున్నారు రాజకీయాన్ని దగ్గరి నుంచి చూస్తున్న వాళ్లు!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 22, 2023 | 03:42 PMLast Updated on: Sep 22, 2023 | 3:42 PM

Thatikonda Rajaiah Extends Support The Brs Candidate Kadiyam Srihari

Kadiyam Srihari: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇవాళ కలిసినట్లు అనిపించిన నాయకులు, కలిసినట్లు కనిపించిన నేతలు.. అలా పక్కకు జరగగానే బళ్లాలు దూసుకుంటారు. రాజకీయాల్లో ఇదంతా కామన్! అలాంటిది ఏళ్ల శతృత్వం అంత ఈజీగా మర్చిపోతారా అంటే.. అసలు కుదరని మ్యాటర్‌ అనే టాక్ వినిపిస్తోంది రాజయ్య, కడియం వ్యవహారంలో! కేటీఆర్ సమక్షంలో రాజయ్య, కడియం శ్రీహరి కలిపోయారు. చేతులు కలుపుకున్నారు. శ్రీహరి కడుపు మీద చేయి పెట్టి మరీ.. తన ఆప్యాయత చూపించారు రాజయ్య. ఇదంతా బయటకు కనిపించే సీన్. నిజంగా ఇది నిజమా అంటే.. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అంటున్నారు రాజకీయాన్ని దగ్గరి నుంచి చూస్తున్న వాళ్లు!

రాజయ్య, కడియం మధ్య శతృత్వం ఇప్పటిది కాదు. దశాబ్దాల చరిత్ర ఉంది దానికి. రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచే.. తనను తొక్కేయడానికి కడియం ప్రయత్నాలు చేస్తున్నారని.. మన డయల్ న్యూస్ ఇంటర్వ్యూలోనే చెప్పుకొచ్చారు రాజయ్య. అలాంటిది ఇంత ఈజీగా వాళ్లిద్దరు కలిసిపోయే అవకాశం ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజయ్య ఉన్నారు. ఐతే ఆయనను పక్కనపెట్టి.. కడియంకు టికెట్ కేటాయించారు కేసీఆర్. దీంతో రాజయ్య హర్ట్ అయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పొర్లు దండాలు పెట్టి మరీ బొర్లిబొర్లి ఏడ్చారు. తాను పెంచుకున్న సామ్రాజ్యాన్ని ఎవరో ఏలుతా అంటే ఎలా ఊరుకుంటానంటూ కామెంట్లు చేశారు. ఓ సమయంలో బీఆర్ఎస్‌ దూతగా పల్లా ఇంటికి వచ్చినా.. కలవకుండానే ఆయనను వెనక్కి పంపించారు రాజయ్య. దీంతో గులాబీ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. కేటీఆర్ రంగంలోకి దిగారు. కడియం, రాజయ్య మధ్య సయోధ్య కుదిర్చారు. రాజయ్య కూడా ఓ నవ్వు నవ్వారు.

మరి ఈ కలయిక ఎన్ని రోజులు ఉంటుంది అన్నదే ఇక్కడ హాట్‌ టాపిక్‌. స్టేషన్‌‌ఘన్‌పూర్‌లో రాజయ్య పాతుకుపోయారు. 2009 నుంచి రాజయ్య గెలుపును ఎవరూ ఆపలేకపోయారు. వరసగా నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో గెలిచిన రాజయ్యకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ అప్పగించారు. ఐతే అవినీతి ఆరోపణలపై ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. అయినా 2018లో రాజయ్యకే తిరిగి గులాబీ బాస్ టిక్కెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగింది. మరోవైపు ఆయనపై ఇటీవల మహిళ సర్పంచ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు వైరల్‌గా మారాయ్. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజయ్యకు టిక్కెట్ ఇవ్వకుండా కేసీఆర్.. కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థిని ప్రకటించిన వెంటనే వ్యతిరేకించిన రాజయ్య.. ఇతర పార్టీల వైపు వెళ్లేందుకు కూడా సిద్ధమయినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహను కలిసినట్లు ప్రచారం జరిగింది.

అయితే అనూహ్యంగా శత్రువులుగా ఉన్న ఇద్దరినీ ఏకం చేశారు. కడియం శ్రీహరి 1994, 1999లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ఒకవేళ గెలిస్తే కడియం శ్రీహరి దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తిరిగి స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే అయినట్లు. వీరిద్దరి కలయిక ఎన్నికల వరకూ కొనసాగుతుందా లేక ప్రగతి భవన్‌కే పరిమితం అవుతుందా అన్నది చూడాలి మరి.