Top story: ఖాళీ చేస్తారా ? కూల్చివేయాలా ? విశాఖ శారదాపీఠానికి రెవెన్యూ శాఖ నోటీసులు
విశాఖ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే 15 ఎకరాల భూముల అనుమతులు రద్దు చేసిన సర్కార్...తాజాగా ఆక్రమించిన 5వందల కోట్ల విలువైన భూములపై ఫోకస్ చేసింది.

విశాఖ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే 15 ఎకరాల భూముల అనుమతులు రద్దు చేసిన సర్కార్…తాజాగా ఆక్రమించిన 5వందల కోట్ల విలువైన భూములపై ఫోకస్ చేసింది. ఆ భూములను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే…తామే కూల్చివేస్తామంటూ నోటీసుల్లో ప్రస్తావించింది.
భక్తి ముసుగులో ప్రభుత్వ భూములను ఆక్రమించింది విశాఖ శారదాపీఠం. వందల కోట్లు విలువ చేసే భూములను…ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా వందల కోట్లు విలువైన భూములను తమ ఆధీనంలోకి తీసుకుంది. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించింది విశాఖ శారదాపీఠం. గత ప్రభుత్వం అండతో విచ్చలవిడిగా భూములను ఆక్రమించింది. వందల కోట్ల భూములను కబ్జా చేసేసింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత…శారదాపీఠం భూములపై ఫోకస్ చేసింది. తాజాగా ఆక్రమించిన భూములను వెంటనే ఖాళీ చేయాలని పీఠం మేనేజర్‌కు నోటీసులు ఇచ్చింది. అంతేకాదు వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే…తామే ఆక్రమణలను కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. సర్వే నంబర్ 90లో ఉన్న రహదారి భూమిని ఆక్రమించుకున్నారని…ఇది ప్రభుత్వ భూమి. ఇందులో నిర్మాణాలు చేశారని నోటీసుల్లో స్పష్టం చేసింది. భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో, అక్రమ నిర్మాణాలను ఎందుకు జప్త్తుచేయకూడదో వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో శారదా పీఠం ఉంది. ఈ పీఠం చుట్టూ…జీవీఎంసీ, రెవెన్యూ శాఖకు చెందిన విలువైన భూములు ఉన్నాయి. ఇటు రెవెన్యూ, అటు మున్సిపల్ భూములను పీఠం ఆక్రమించుకుని నిర్మాణాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ 5వందల కోట్లపైనే. ఈ భూముల సర్వేకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో శారదాపీఠం అడ్డుకుంది. భూములపై దృష్టి పెట్టిన కూటమి సర్కార్…కలెక్టర్, జేసీలను అమరావతికి పిలిపించి భూములకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంది. ఆ తర్వాత ఆక్రమణలపై శారదాపీఠానికి నోటీసులివ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం-1905లోని సెక్షన్ 7 కింద…పెందుర్తి తహసీల్దార్ శారదాపీఠానికి నోటీసులు ఇచ్చారు. వీఎంఆర్‌డీఏ ఆమోదించిన మున్సిపల్ స్థలం కూడా పీఠం ఆక్రమణలో ఉంది. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వీఎంఆర్‌డీఏ కమిషనర్ హోదాలో కలెక్టర్ మరో నోటీసు ఇవ్వనున్నారు.
శారదా పీఠం విశాఖ నగరంలోని పెందుర్తి మండల పరిధిలోని చినముషిడివాడలో ఉంది. ఇక్కడ సర్వే నెంబరు 87/1లో ఈనాం పుంజ 4.85 ఎకరాలుంది. ఇందులో 35 సెంట్లు భూమి ఆక్రమణకు గురైంది. ఇది వీఎంఆర్డీఏ ఆమోదించిన లే-అవుట్‌లో (ఎల్‌పీ నెంబరు 11/86) రోడ్డుగా ఉంది. క్షేత్రస్థాయిలో శారదా పీఠం కార్యాలయ భవనం, గెస్ట్‌హౌస్, స్వామీజీ పీఠం, తారు రోడ్డుతో ప్రవేశ గేటు అందులో ఉన్నాయి. సర్వే నెంబరు 90లో పోరంబోకు భూమి 72 సెంట్లు ఉంది. ఇందులో 22 సెంట్లు రెవెన్యూ రికార్డుల్లో రస్తాగా నమోదైంది. ఈ 22 సెంట్లలో ప్రస్తుతం పీఠం దేవాలయం, తారు రోడ్డు, సగం వరకు కమ్యూనిటీహాల్ భవనం ఉన్నాయి. 91/1 సర్వే నెంబరులో సర్కార్ పుంజ 2.96 ఎకరాలు, 91/3 సర్వే నెంబరులో 1.30 ఎకరాలుంది. ఈ రెండింటి పరిధిలో 16 సెంట్లు వీఎంఆర్డీఏ లేఅవుట్ లో ఖాళీ స్థలంగా ఉంది. ఇందులో ప్రస్తుతం విద్యార్థులకు, టీచర్లకు వసతి గృహంతోకూడిన వేదపాఠశాల ఉన్నాయి. సర్వే నెంబరు 91/9లో 81 సెంట్లు సర్కార్ పుంజ ఉండగా, అందులో 41 సెంట్లలో 3 దేవాలయాలు, సగం కమ్యునిటీ హాల్ నిర్మించి పీఠం ఆధీనంలో ఉన్నాయి.
విశాఖలో 300 కోట్లు విలువజేసే భూమిని రూ.15 లక్షలకు శారదాపీఠానికి గత ప్రభుత్వం అప్పగించింది. మార్కెట్ విలువ వసూలు చేయాల్సి ఉన్నా…తక్కువ ధరకే కట్టబెట్టారు. ఎకరా రూ.1.5 కోట్లు విలువ ఉండగా…కేవలం రూ.1 లక్షకే శారదా పీఠానికి భూములను కేటాయించింది. భూముల కేటాయింపులకు జీవీఎంసీ ఆమోదం పొందలేదు. ఎన్వోసీ కూడా తీసుకోలేదు. వేద పాఠశాల కోసం భూములు తీసుకుని వాణిజ్య అవసరాల కోసం అనుమతి కోరింది. కూటమి ప్రభుత్వం వచ్చాక శారదా పీఠానికి అక్రమంగా ఇచ్చిన భూములు రద్దు చేసింది.