Tirumala Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డా.. దొంగలు ముఠానా.? దేవుడా నీకు దిక్కెవరు?
తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పైరవీలు.. రకరకాల ప్రభావాలు..కుల సమీకరణాలు..రాజకీయ అవసరాలు.. వ్యాపార ఒప్పందాలు ఇది ప్రభుత్వం దృష్టిలో టిటిడి అంటే.
తిరుమల అంటే ఒక దైవిక అనుబంధం. వెంకటేశ్వర స్వామి అంటే ఏదో తెలియని అవినాభావ సంబంధం. ఏడాదికి ఒక్కసారైనా బ్రహ్మాండ నాయకుని దర్శించుకొని ఆ ప్రసాదం తీసుకుని వస్తే అంతకు మించిన పుణ్యం ఏముంటుందని సామాన్య జనం అనుకుంటూ ఉంటారు. కానీ అధికార పార్టీ, ప్రభుత్వాల తీరు మాత్రం మరో రకంగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పైరవీలు.. రకరకాల ప్రభావాలు..కుల సమీకరణాలు..రాజకీయ అవసరాలు.. వ్యాపార ఒప్పందాలు ఇది ప్రభుత్వం దృష్టిలో టిటిడి అంటే. ఈమధ్య వేసిన 25 సభ్యుల టిటిడి బోర్డు చూస్తే.. ఇది ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంబంధించిన బోర్డ్ కాదు ఓ పెద్ద దొంగల ముఠా అనిపిస్తుంది. వినడానికి కటువుగా ఉన్న అది నిజం. వైసీపీ నేత విజయసాయిరెడ్డి బంధువు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు, వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి కి టిటిడి బోర్డు సభ్యునిగా పదవి లభించింది. అదేవిధంగా దేశంలో మెడికల్ కాలేజీలు ,మెడికల్ సీట్లు కుంభకోణంలో ఒక మాఫియా డాన్ లాంటి వ్యక్తి, సి బి ఐ కి కోట్ల రూపాయలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దళారి కేతన్ దేశాయ్ కి కూడా టిటిడిలో చోటు దొరికింది.
వీళ్లు రెండేళ్లపాటు తిరుమలలో అన్ని వ్యవహారాలు చక్కబెడతారు. ఇది వినడానికి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. అధికారం ఉంది కదా అని..స్థాయి లేని వాళ్ళని, నేరస్తుల్ని, నేరుగా తీసుకెళ్లి తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో కూర్చోబెట్టడానికి, సిగ్గు విడిచి ఇలాంటి పనులు చేయడానికి ఎంతగా ఏపీ ప్రభుత్వం ఎంతలా తెగ పడుతుందో అర్థం అవుతుంది. కనీసం జనం ఏమైనా అనుకుంటారా? ఇలాంటి వ్యక్తుల్ని ఆధ్యాత్మిక కేంద్రంలో కూర్చోబెడితే ప్రభుత్వం పరువు ఏ మవుతుంది ఇవేమీ ఆలోచించరా? టీటీడీ అంటే కేవలం రాజకీయ పునరావాస కేంద్రం మాత్రమేనా? నిజంగానే వీళ్ళకి పాప భీతి లేదా? అసలు బోర్డులో ఎలాంటి వ్యక్తులు ఉండాలి? వాళ్ల స్థాయి ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? గతంలో కూడా విశాఖ స్వయం ప్రకటిత శారదాపీఠం స్వామీజీ చెప్పాడని ఓ రియల్ ఎస్టేట్ అధినేతకి టీటీడీలో సభ్యునిగా చోటిచ్చారు. ఈ సాహితీ రియల్ ఎస్టేట్ వ్యాపారి వేల కోట్లకు జనాన్ని మోసం చేసి చివరకు కటకటాల వెనక్కి వెళ్ళాడు. కళ్ళు తెరిచి అతను తొలగించక తప్పలేదు. రియల్ ఎస్టేట్ వాళ్లు, కుల సంఘాల పెద్దలు, రాజకీయ నిరుద్యోగులు, బ్రోకర్లు వీళ్ళనా టిటిడి బోర్డులో పెట్టేది? ఎలాహంక ఎమ్మెల్యే కి కూడా బోర్డులో మళ్ళీ చోటిచ్చారు. ఇతగాడు స్వయంగా ప్రభుత్వ అధినేతకు బినామీ అని బెంగళూరులో అందరికీ తెలుసు. ఇన్ని దారుణాలు చూస్తూ ఇంకా వెంకటేశ్వర స్వామి ఎందుకు భరిస్తున్నాడో అర్థం కాదు.
ఒక మంచి పీఠం నుంచి.. శాస్త్రం తెలిసిన ఒక స్వామీజీని.. బాగా చదువుకున్న వేద జ్ఞానం ఉన్న ఒక పండితుడిని నలుగురికి పాఠాలు చెప్పే ఒక అధ్యాపకుని బోర్డులో వేయకూడదా.? చిల్లర వేషాలు వేసే రాజకీయ నాయకులు, గూండాలు ,రౌడీలు ,సినిమా నిర్మాతలు వీళ్ళకు మాత్రమే టిటిడి బోర్డులో శాశ్వత స్థానాలు కల్పిస్తారా? వైయస్ జగన్ నీ త్యాగమూర్తిగా.. గొప్ప ఉద్యమకారునిగా ప్రమోట్ చేసే సినిమాలు తీస్తున్న దాసరి కిరణ్ కుమార్ కిందటి టిటిడి బోర్డులో సభ్యుడిగా కొనసాగారు. బొడ్డు చుట్టూ కెమెరాలు తిప్పే కే రాఘవేంద్ర రావు కూడా.. ఒకప్పుడు చంద్రబాబు హయాంలో టీటీడీ పంచనబతికినవాళ్లే. 16 నెలలు జగన్ తో పాటు జైల్లో ఉన్న విజయ సాయి రెడ్డి కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ బోర్డు మెంబర్ గానే ఉన్నారు. సిబిఐ కేసులో ఉన్నవాళ్లు, కూనికోర్లు, మాఫియా డాన్లు, మెడికల్ సీట్లు అమ్ముకునే వాళ్ళు, బ్రోకర్లు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అధికార దర్పంతో వెలిగి పోతున్నారు. అత్యున్నత పీఠాలపైనే నేరస్తులు కూర్చున్నప్పుడు.. ఈ చిన్న చిన్న బోర్డు మెంబర్లు గా నేరస్తులు ఉంటే తప్పేంటని అనుకున్నారేమో.
తిరుమల ఇప్పటికే పొలిటికల్ పార్టీ ఆఫీసులా తయారయింది. ప్రదాన ఆచార్యుల దగ్గర నుంచి టిటిడి చైర్మన్ వరకు , మెంబర్లు , ఉద్యోగులు అందరూ రాజకీయాలు చేసేవాళ్లే. జనం మాత్రమే దేవుడిని నమ్ముకుని కొండకు వెళ్తున్నారు. అసలు కొండమీద బోర్డు మెంబర్లకు ఏం పని? దర్శనాలు చేయించి ఆ పైరవీలతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు పట్టుకుంటారా? కొండపై కూడా దొరికినంత దోచుకుంటున్నారా? టీటీడీ బోర్డు మెంబరు సామాజికంగా ఒక గౌరవంగా భావిస్తున్నారా? పోనీ వీళ్ళు ఏరకంగా అయినా తిరుమల అభివృద్ధికి ఉపయోగపడతారా? కొన్నేళ్ల క్రితం ఇంట్లో 130 కోట్ల రూపాయల క్యాష్ తో దొరికిన సాండ్ మాఫియా డాన్ జె .శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డులో రెండుసార్లు సభ్యుడిగా ఉన్నారు. చిత్రమైన విషయం ఏమంటే టిడిపి, వైసిపి రెండు ప్రభుత్వాలు ఆయన్ని మెంబర్ గాని వేసుకున్నారు. అంటే ఎలాంటి శక్తులు దేవుని చుట్టూ చేరుతున్నాయో చూడండి. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా మీరు ఏదైనా చేసుకోండి..ఎన్నైనా అనుకోండి, ఏమైనా పీక్కోండి మేమేం చేయాలనుకుంటామో అదే చేస్తాం. ఇలా ఉంది వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పనితీరు .దానికి ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లో మెంబర్ల నియామకం. దేవుడు నీకు దిక్కెవరు?