ఎమ్మెల్సీ ఓకే.. మంత్రి పదవి లేనట్టేనా…?
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతున్నది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికాగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో, ఎవరిని ఎంపిక చేస్తారు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతున్నది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికాగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో, ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అనే దానిపై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పదిమంది ఎమ్మెల్యేలు ఆమోదించారు. దీనితో నాగబాబు శాసనమండలిలో అడుగుపెట్టడం లాంచనమైంది.
ఇక త్వరలోనే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంచనం అయిన నేపథ్యంలో.. ఆయనను మంత్రిగా తీసుకుంటారా లేదా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. నాగబాబును మంత్రిగా క్యాబినెట్ లోకి తీసుకుంటామని టిడిపి అలాగే జనసేన పార్టీ ప్రకటించిన తర్వాత.. టిడిపి క్యాడర్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. నాగబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని.. టిడిపి క్యాడర్ ఆ పార్టీ అధిష్టానాన్ని విమర్శించింది.
దీనితో నాగబాబును ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడం లేదనే ప్రచారం కూడా జరిగింది. ఆయనను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నాగబాబును కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే ఎంపిక చేసి మంత్రి పదవి ఇవ్వకూడదు అని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఒక మంత్రి పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. త్వరలోనే దీనిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ పదవికి కచ్చితంగా నాగబాబుని ఎంపిక చేస్తారని వార్తలు వచ్చినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా నాగబాబుని ఎంపిక చేస్తే ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు.
ముఖ్యంగా టిడిపి క్యాడర్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే ఆయనను కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉంచి, ఆ పదవికి మరొకరిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక రాజ్యసభకు కూడా జనసేన పార్టీ నేతను ఎంపిక చేయడం ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల 3 రాజ్యసభ స్థానాలను భర్తీ చేయగా అందులో ఒక స్థానాన్ని బిజెపికి కేటాయించారు.
మరో రెండు స్థానాలను టిడిపి తీసుకుంది. ఇక త్వరలోనే మరో రాజ్యసభ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. దీనిపై జనసేన పార్టీలో ఒక కీలక నేత ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగానే వినపడుతోంది. ఇక తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.