ఆంధ్రప్రదేశ్ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం సుమారు 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానమంత్రిని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్థిక ప్యాకేజీ పై కేంద్రం అధికారిక ప్రకటన వెలువడితే సంస్థతోపాటు ఉద్యోగుల ఆర్థిక కష్టాలు కూడా తొలగినట్లే. నాలుగు నెలలుగా జీతాలు లేవని విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నెలకు 500 కోట్లు చొప్పున నాలుగు నెలల అడ్వాన్స్ గా ఇచ్చేటట్లు ఒప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు కేంద్రం ముందు ఉంచగా దానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.[embed]https://www.youtube.com/watch?v=JfGqNR3osxI[/embed]